Be Alert: హలో.. మీ నెంబర్ కు గల సేవలు నిలిచిపోతున్నాయి. ఇక మీరు ఇదే నెంబర్ పై మీ సేవలు కొనసాగించలేరు. అందుకు మీరు మా కస్టమర్ అదేనండీ.. మా కస్టమర్ కేర్ నెంబర్ కు మాత్రమే కాల్ చేయండి.. లేకుంటే మా కస్టమర్ కేర్ నుండి వచ్చే కాల్ కి సమాధానం ఇవ్వండి. లేకుంటే మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుంది. ఇక మీ ఇష్టమంటూ కాల్.
అయ్యో దేవుడా.. బ్యాంక్ అకౌంట్ కి ఇదే నెంబర్.. ఆధార్ నెంబర్ కి ఇదే నెంబర్.. పంట భీమాకు ఇదే నెంబర్ కదా అంటూ మనకు ఆలోచన వచ్చేలోగానే +81 76711 5857 నెంబర్ నుండి కాల్ వస్తుంది. హమ్మయ్య కస్టమర్ కేర్ నుండి ట్రింగ్.. ట్రింగ్ అంటూ కాల్ వచ్చిందని ఊపిరి పీల్చుకున్నాడు ఆ వ్యక్తి.
మీరు మా కస్టమర్ ప్రతినిధితో మాట్లాడేందుకు ఒకటి నొక్కండి అనగానే.. ఒకటి నొక్కాడు ఆ వ్యక్తి. హలో మేడమ్.. నా నెంబర్ సేవలు ఆగిపోతున్నాయంట కదా.. దయచేసి నేను ఏమి చేయాలో చెప్పండి అనగానే.. ముందుగా మీ పూర్తి పేరు చెప్పండి అంటూ అవతల నుండి ప్రశ్న. వెంటనే సమాధానం ఇచ్చాడు ఇవతలి వ్యక్తి. అలాగే మీకు ఒక ఓటీపీ వచ్చింది. ఆ నెంబర్ చెప్పండి అనగానే.. ఆ ఓటిపి చెప్పేశాడు ఆ వ్యక్తి. ఇక మీ సేవలు కొనసాగుతాయి.. మీరు ఇబ్బంది పడవద్దంటూ మేడమ్ స్వీట్ వాయిస్ తో చెప్పేశారు. పెద్ద ఇబ్బందే తప్పింది కదా.. మేడమ్ చాలా మంచిది అనుకొనే లోగానే.. ఒకటే మెసేజ్ లు వచ్చేస్తున్నాయి మనోడికి.
ఆహా.. ఫోన్ నెంబర్ మళ్లీ యాక్టివ్ అయింది కదా.. అందుకు మేడమ్ పంపి ఉంటుందంటూ ఆనందం. మళ్లీ వస్తున్నాయి మెసేజ్ లు. ఇక ఆగకుండా అసలు ఏం మెసేజ్ లు వచ్చాయో తెలుసుకొనే ప్రయత్నం చేశాడు. అప్పుడు తెలిసింది ఆ మేడమ్ చిలక పలుకులు మెసేజ్ రూపంలో రాలేదని.. తన అకౌంట్ లో నుండి డబ్బులు మొత్తం కాజేశారని గుర్తించాడు. చివరకు అప్రమత్తమై బ్యాంక్ కు వెళ్లాడు.. అకౌంట్ బ్లాక్ చేయించి లావాదేవీలు నిలిపి వేశాడు. ఇలా చేయడంతో ఇక మెసేజ్ ల పర్వం ఆగింది.
ఇదంతా ఏమిటంటే.. ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. మరీ ఇంత తెలివి మీరి మోసాలు చేస్తారని మనం అస్సలు గ్రహించలేము. ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. అచ్చం కస్టమర్ కేర్ నెంబర్ నుండి కాల్ వచ్చినట్లే వస్తుంది. మీ నెంబర్ సేవలు నిలిపి వేస్తున్నామని ఆ వాయిస్ చెబుతుంది. మీ సేవలు కొనసాగేందుకు ఒకటి నొక్కండి అనగానే మనం నొక్కేస్తాం. ఇక అంతే వారు సేమ్ టు సేమ్ కాల్ సెంటర్ ప్రతినిధులు మాట్లాడినట్లే మాటలు చెప్పి ఓటీపీ పంపిస్తారు. మనం చెప్పేస్తాం.. ఇక అంతే మన అకౌంట్ ఖాళీ. ఇలాంటి మోసాల బారిన పడకుండ.. తస్మాత్ జాగ్రత్త అంటూ ఇప్పటికే పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా ఇటువంటి మోసాల బారిన పడకుండా.. ప్లీజ్ బీ అలర్ట్!