Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని ద్వారా ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. అటు భారతీయ రైల్వే సంస్థ సైతం ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కొన్నిసార్లు రైల్లో ప్రయాణించేటప్పుడు ప్యాసెంజర్లకు సంబంధించిన విలువైన వస్తువులు పొరపాటున రైల్లో నుంచి పడిపోతాయి. వాటిలో ముఖ్యమైన థింగ్స్ ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తరచుగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తే ఉంటుంది. ఒకవేళ మీరు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వస్తువులు కూడా ఇలాగే పడిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
⦿ చైన్ లాగడం మానుకోవాలి
రైల్లో ప్రయాణించే సమయంలో ఏవైనా వస్తువులు పడిపోతే చాలా మంది ఎమర్జెన్సీ చైన్ ను లాగుతారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే, ఎమర్జెన్సీ చైన్ ఎలాంటి పరిస్థితులలో లాగాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ లిస్టులో ప్రయాణీకుల వస్తువులు పడిపోతే లాగొచ్చనే పాయింట్ లేదు. ఒకవేళ మీ వస్తువులు పడిపోయినప్పుడు చైన్ లాగితే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.
⦿ వస్తువులు పడిపోయినప్పుడు ఏం చేయాలంటే?
మీరు ప్రయాణిస్తున్న రైల్లో నుంచి ఫోన్, పర్స్, లగేజీ బ్యాగ్ పడిపోతే వెంటనే రైల్వే ట్రాక్ పక్కనే పిల్లర్ మీద ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులో రాసి ఉన్న నెంబర్ ను రాసుకోవాలి. వెంటనే రైల్లో ఉన్న టీజీ దగ్గరికి వెళ్లి ఏ ప్రదేశంలో మీ లగేజీ పోయిందో ఆయనకు చెప్పాలి. అదే సమయంలో పిల్లర్ మీద ఉన్న నెంబర్ ను ఆయన దృష్టికి తీసుకెళ్లాలి.
⦿ రైల్వే సిబ్బందికి చెప్పి రికవరీ చేసే అవకాశం
వెంటనే టీసీ మీ వస్తువులు పడిపోయిన సమీపంలోని రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం అందిస్తారు. అక్కడి సిబ్బందికి చెప్పి, ఆ వస్తువులను రికవరీ చేయిస్తారు. ఆ తర్వాత మీ సామానుకు సంబంధించిన ఆధారాలు చూపించి వాటిని తీసుకోవచ్చు.
Read Also: వందే భారత్ రైళ్లలో విపరీతమైన రద్దీ.. ఈ రూట్లలో పెరగనున్న కోచ్‌ల సంఖ్య!
⦿ అధికారులను సంప్రదించండి!
అటు టీసీతో పాటు అవసరం అయితే, రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్ లైన్ 182కు కాల్ చేయాలి. లేదంటే రైల్వే హెల్ప్ లైన్ 139కి కాల్ చేయాలి. వారికి విషయం చెప్తే, పడిపోయిన మీ వస్తువులను వారు తీసుకొచ్చి అందజేసే అవకాశం ఉంటుంది. మీరు రైలు ప్రయాణం చేసే సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సింఫుల్ గా ఇలా మీ వస్తువులను తిరిగి తెప్పించుకునే ప్రయత్నం చేయండి.
Read Also: వార్ని.. 4 గంటల్లోనే బెంగళూరుకు? ఈ వందేభారత్ ట్రైన్ చాలా స్పీడు గురూ!