Indian Railways: భారతీయ రైల్వే సంస్థ సామన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రయత్నించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. జనరల్ క్లాస్ టికెట్ల ధరలు చాలా తక్కువగా ఉండేలా చూడాలని సిఫార్సు చేసింది. ఒకవేళ ఆర్థిక లోటు ఏర్పడితే ఏసీ క్లాస్ టికెట్ల ధరలకు పెంచుకోవచ్చని సూచించింది. రైల్వే సంస్థ మెరుగైన పనితీరు కోసం ఛార్జీల సర్దుబాట్లతో పాటు ఖర్చును ఆప్టిమైజ్ చేసుకోవాలని వెల్లడించింది.
అందరి నిర్ణయం ఒకటే!
తాజాగా ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగిన రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా టికెట్ల ధర పెంపు పైన కీలక చర్చ జరిగింది. కమిటీ సభ్యులంతా జనరల్ క్లాస్ ప్రయాణ ఛార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండాలనే అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ రైల్వే నష్టాలను తగ్గించుకోవాలని భావిస్తే ఏసీ క్లాస్ ఛార్జీలు పెంచడంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించింది.
ఖర్చులను తగ్గించుకోవాలని రైల్వే సంస్థకు సూచన
రైల్వే సంస్థ టికెట్ల ధరల పెంపుపై ఫోకస్ పెట్టకుండా, రైళ్ల నిర్వహణ ఖర్చులను సమీక్షించుకోవాలని, వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రతి టికెట్‌పై 46% తగ్గింపు రాయితీతో సహా ఏటా రూ. 56,993 కోట్ల రాయితీలు, సీనియర్ సిటిజన్ రాయితీలను కొనసాగించలేమని రైల్వేశాఖ స్పష్టం చేసింది. మరోవైపు రైళ్లలో క్యాటరింగ్ సేవలు అవసరం అని కమిటీ అభిప్రాయపడింది. రైల్వే సంస్థ ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి క్యాటరింగ్ సేవలను తొలగించడం మంచిదని సిఫార్సు చేసింది. ఒకవేళ కొనసాగించాలి అనుకుంటే ధర ఎక్కువైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించింది.
Read Also: బండరాళ్లతో రైలు అద్దాలు ధ్వంసం, యూపీలో రెచ్చిపోయిన ప్రయాణీకులు, వీడియో వైరల్!
ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే!
భారతీయ రైల్వే సంస్థ ప్రైవేటీకరణకు సంబంధించి లోక్‌సభలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భారతీయ రైల్వే సంస్థ మౌలిక సదుపాయాలలో ప్రైవేట్ రంగ ప్రాధాన్యతను పెంచాలని సిఫార్సు చేయడం విశేషం. రైల్వే సవరణ బిల్లు- 2024కు చర్చ సందర్భంగా చాలా మంది సభ్యులు రైల్వేను ప్రైవేటైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. అయితే, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. భారతీయ రైల్వే సంస్థను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయబోమని తేల్చి చెప్పారు.
కానీ, రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మాత్రం భారత రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు భారీ మూలధన పెట్టుబడి అవసరమని అభిప్రాయపడింది. రైల్వేల మౌలిక సదుపాయాల మెరుగుదలకు బోలెడు అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇందుకోసం ప్రణాళికా వ్యయాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ తేల్చి చెప్పింది. మరోవైపు ఈ సిఫార్సులు కొంత మేర ఆశ్చర్యం కలిగిస్తున్నాయని విపక్ష సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: స్పెషల్ కోటాలో టికెట్ బుకింగ్, కచ్చితంగా కన్ఫర్మ్ కావాల్సిందే! ఇలా ట్రైచేయండి!