First Ever Heart Transport by Train in India: భారత రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలో తొలిసారిగా దాత గుండెను రైలు ద్వారా ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించింది. ఈ చారిత్రాత్మక మిషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కీలక పాత్ర పోషించింది. సూరత్ లో సేకరించిన దాత గుండెను అహ్మదాబాద్ లోని ఆస్పత్రికి అత్యంత వేగంగా, సురక్షితంగా చేర్చి.. ఓ వ్యక్తి జీవితాన్ని కాపాడింది. ముంబై సెంట్రల్–గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఈ గుండెను సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు. అనంతరం అహ్మదాబాద్ లోని యు.ఎన్. మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేర్చి అవయవ మార్పిడి ప్రక్రియను విజయవంతం చేశారు.
గుండె మార్పిడి లాంటి వైద్య ప్రక్రియల్లో సమయం ఎంతో కీలకం. దాత నుంచి తీసిన గుండెను నిర్దిష్ట సమయానికి గ్రహీత దగ్గరికి చేర్చాల్సి ఉంటుంది. అందుకే ఈ మొత్తం ఆపరేషన్ ను అత్యంత జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించి నిర్వహించారు. ఈ మిషన్‌లో భారత రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గుజరాత్ పోలీసులు, వైద్యు నిపుణులు సమన్వయంతో పనిచేశారు. రైలులో ప్రయాణం నుంచి ఆస్పత్రి వరకు ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రతి దశను ముందుగానే ప్లాన్ చేశారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు చేరుకున్న వెంటనే ప్లాట్ ఫాం నంబర్-1 నుంచి యు.ఎన్. మెహతా ఆస్పత్రి వరకు ప్రత్యేక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గుండెను నేరుగా ఆస్పత్రికి తరలించి మార్పిడి ప్రక్రియను వెంటనే ప్రారంభించగలిగారు.
ఈ ఆపరేషన్ తో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కేవలం ప్రయాణికుల రవాణాకే కాకుండా అత్యవసర వైద్య సేవల్లో కూడా ఎంత కీలకంగా ఉపయోగపడగలదో నిరూపించింది. వేగం, టైమ్ మెయింటెనెన్స్, నమ్మకం లాంటి లక్షణాల వల్ల ప్రాణాలను కాపాడే మిషన్లలో కూడా ఈ రైలు కీలక పాత్ర పోషించగలదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ వేద్ ప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ రైల్వేకు ఇది ఎంతో గర్వకారణమైన రోజు అన్నారు. ప్రయాణికులు, సరుకు రవాణాతో పాటు సమాజానికి అవసరమైన అత్యవసర సేవల్లోనూ రైల్వే తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, గుజరాత్ పోలీసులు, వైద్యులు, అవయవ మార్పిడి సమన్వయకర్తలు అందరికీ భారత రైల్వే ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సమయానికి గుండెను ఆస్పత్రికి చేర్చడం ద్వారా ఒక రోగికి కొత్త జీవితం అందించే అవకాశం కల్పించిన ఈ ఘటన భారతీయ రైల్వే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
Read Also: బుల్లెట్ రైళ్ల కోసం స్వదేశీ కంట్రోల్ సిస్టమ్.. భారత్ సంచలన నిర్ణయం!