Janmabhoomi Express Route Change: ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ రాకపోకలు కొనసాగించే జన్మభూమి ఎక్స్ ప్రెస్ విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం-లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలుకు సంబంధించి ఇకపై సికింద్రాబాద్ హాల్టింగ్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఈ రైలు చర్లపల్లి- అమ్ముగూడ- సనత్ నగర్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుందని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం-లింగంపల్లి- విశాఖపట్నం మధ్య ప్రతి రోజూ ప్రయాణం కొనసాగించనుంది.
జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు మంచి డిమాండ్
12805/12806 నెంబర్ గల జన్మభూమి ఎక్స్ ప్రెస్ లింగంపల్లి – విశాఖపట్నం మధ్య తన సర్వీసులను అందిస్తుంది. ఈ రైలుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల నుంచి మంచి స్పందన ఉంటుంది. నిత్యం ఈ రైలు ప్రయాణీకులతో రద్దీగా కనిపిస్తుంది. పండుగ సమయాల్లో ఇసుక వేస్తే రాలనంత మంది ఈ రైల్లో ప్రయాణిస్తుంటారు. ఇకపై ఈ రైలు చర్లపల్లి మీదుగా రాకపోకలు కొనసాగించనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు.
జన్మభూమి ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ వివరాలు
ఇక మీదట విశాఖపట్నం- లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805) చర్లపల్లి మీదుగా నడవనుంది. ఈ రైలుప్రతి రోజు ఉదయం 6.20 గంటలకు విశాఖ పట్నం నుంచి బయల్దేరుతుంది. సాయంత్రం 6.05 నిమిషాలకు చర్లపల్లి టెర్మినల్ కు చేరుకుంటుంది. 5 నిమిషాల పాటు ఇక్కడ ఆగుతుంది. సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. అమ్ముగూడ మీదుగా రాత్రి 7.40 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్(12806) చర్లపల్లి మీదుగా ప్రయాణిస్తుంది. ఉదయం 6.15 గంటలకు లింగంపల్లి నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. అమ్ముగూడ మీదుగా ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి టెర్మినల్ కు వస్తుంది. అక్కడ 5 నిమిషాల పాటు ఆగుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Read Also: ఇక ఆ రైళ్లన్నీ చర్లపల్లి నుంచే, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, కారణం ఏంటంటే?
శాశ్వత ప్రాతిపదికన జన్మభూమి ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు
ఇప్పటి వరకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ తీసుకోగా.. ఈ నెల 25 నుంచి అటు వైపు వెళ్లదు. సికింద్రాబాద్ లో హాలింగ్ లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్లపల్లి మీదుగా ఈ రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ప్రయాణించే రూట్ లోని ఇతర స్టాప్ లు, టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను ఇప్పటికే చర్లపల్లి నుంచి నడిపిస్తున్నారు. మరికొన్ని రైళ్లను కూడా చర్లపల్లి నుంచి దారి మళ్లించే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్ మెట్రోలో చేతులు పట్టుకున్న జంట.. ఇది అమెరికా కాదంటూ క్లాస్!