Vande Bharat Free Travel: దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘చక్ర’ శ్రేణి శౌర్య పురస్కారాలు అందుకున్న వారికి ఇకపై దేశంలోని అన్ని రైళ్లలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇందులో వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు కూడా ఉన్నాయి. రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వీర సైనికులకు మరింత లాభం కలగనుంది.
ఇప్పటి వరకు శౌర్య పురస్కార గ్రహీతలకు కొన్ని రైల్వే ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ ను మరింత విస్తరించింది. ఇకపై ‘చక్ర’ శ్రేణి పురస్కారాలు పొందిన వారు వందే భారత్ సహా దేశంలో నడిచే అన్ని రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చిన తెలిపింది. ఈ కొత్త నిర్ణయం వల్ల ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి కూడా ఎలాంటి టికెట్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ కొత్త ప్రయాణ సౌకర్యం గురించి భారత సైన్యం అధికారిక ‘ఎక్స్’ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శౌర్య పురస్కార గ్రహీతలకు అందించే ట్రావెల్ బెనిఫిట్స్ మరింత మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని తెలిపింది. దేశ రక్షణ కోసం విశేష సేవలు అందించిన సైనికుల ధైర్యం, త్యాగాలను గుర్తించి గౌరవించడంలో ఇది మరో కీలక ముందడుగుగా అభివర్ణించింది.
దేశంలో శౌర్యం, ధైర్యసాహసాలకు గుర్తింపుగా ప్రభుత్వం పలు పురస్కారాలను అందిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న మొదటిసారిగా మూడు శౌర్య పురస్కారాలను ఏర్పాటు చేశారు. వీటిని 1947 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరికొన్ని పురస్కారాలను కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో ఆరు ప్రధాన శౌర్య పురస్కారాలు ఉన్నాయి. అవి..
1.పరమ వీర చక్ర (Param Vir Chakra)
2.అశోక చక్ర (Ashoka Chakra)
3.మహా వీర చక్ర (Maha Vir Chakra)
4.కీర్తి చక్ర (Kirti Chakra)
5.వీర చక్ర (Vir Chakra)
6.శౌర్య చక్ర (Shaurya Chakra)
దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే సైనికులకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో అన్ని రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లలోనూ ఈ బెనిఫిట్స్ వర్తించడం విశేషం.
Read Also: అయోధ్య-జనక్‌పూర్ రైలు వెనుక మాస్టర్ ప్లాన్.. మరో 4 దేశాలపై ఇండియన్ రైల్వే కన్ను!