Bairabi Railway Station: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతున్నది. సుమారు 68 వేల కిలో మీటర్లకు పైగా రైల్వే లైన్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 7, 301 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల సరిహద్దుల్లో ఏకంగా 1,000కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 20 వేల రైళ్లు తమ రాకపోకలను కొనసాగిస్తాయి. అయితే, దేశంలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మిజోరాంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్
దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రంలో బైరాబి అనే రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ దేశంలోని తూర్పున ఉన్న రైల్వే లైన్ కు ఎండింగ్ పాయింట్ గా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కోలాసిబ్ జిల్లాలోని బైరాబి పట్టణంలో ఉన్నది. ఇది ఆ రాష్ట్రం అంతటికీ ఏకైక రైల్వే కనెక్షన్ గా పని చేస్తుంది. మిజోరాంకు రైలు ద్వారా రవాణా చేయబడిన సరుకులు అన్నీ ఇక్కడికే చేరుకుంటాయి. ఈ స్టేషన్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. ఇది రాష్ట్రంలోని ఏకైక, చివరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ముందుకు రైల్వే లైన్ విస్తరించే అవకాశం లేదు. ఇందుకు కారణం భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.
మిజోరాం ప్రజల రాకపోకలకు సవాల్
సుమారు 11 లక్షల జనాభా ఉన్న మిజోరాంలో ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్ట్రంలోని ప్రజలంతా ప్రయాణం చేసేందుకు ఇదే రైల్వే స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. బైరాబి రైల్వే స్టేషన్ ఉత్తర మిజోరాం, ఐజ్వాల్ సిటీ నుంచి దాదాపు 90 కి.మీ దూరంలో ఉంటుంది. ఆయా ప్రాంతాల ప్రజలు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం మూడు ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. 2016లో అప్ గ్రేడ్ చేశారు. అయితే, ఫ్లాట్ ఫారమ్ ల సంఖ్య మాత్రం పెరగలేదు. బైరాబి రైల్వే స్టేషన్ అస్సాంలోని కటఖల్ జంక్షన్‌కు 84 కి.మీ దూరంలో లింకై ఉంటుంది. మిజోరాంలో అదనంగా మరో రైల్వే స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉన్నది. రైల్వే శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నది. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఒకవేళ మరో రైల్వే స్టేషన్ ఏర్పాట్లు చేస్తే రాష్ట్రానికి కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉంటుంది.
మిజోరాంలో ఎందుకు ఒకే ఒక్క స్టేషన్ ఉందంటే?
మిజోరాంలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉండటానికి ప్రధాన కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు. ఈ రాష్ట్రం ఎక్కువగా కొండ ప్రాంతాలను కలిగి ఉంటుంది. ఇక్కడ రైల్వే ట్రాక్ లను వేయడం సవాలుతో కూడిన వ్యవహారం. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రెండవ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: జమ్మూ- శ్రీనగర్ రూట్ లో పరుగులు తీసే తొలి రైలు వందే భారత్ కాదా? ఇదీ అసలు కథ!