Indian Railways Chain Pulling Rules: ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణం చేసేలా భారతీయ రైల్వే తగిన చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైళ్లలో గత కొంత కాలంగా భద్రతను పెంచింది. అదే సమయంలో ఎమర్జెన్సీ పరిస్థితులలో రైళ్లను ఆపేందుకు అలరం చైన్ ను ఏర్పాటు చేశారు. వీటిని మిస్ యూజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వే సంస్థ వెల్లడించింది. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపింది. రైలు చైన్ లాగే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి, తప్పదు అనుకుంటేనే లాగాలని సూచిస్తున్నారు.
అవనసరంగా చైన్ లాగితే ఏమవుతుందంటే?
భారతీయ రైల్వే అలారం చైన్ కు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 141ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రత్యేకంగా అలారం చైన్ దుర్వినియోగాన్ని అరికట్టేలా రూపొందించారు. అనవసరంగా చైన్ లాగితే ఎలాంటి చట్ట పరమైన చర్యలు తీసుకుంటారో ఇందులో వివరంగా రాసి ఉంటుంది. ఇక రైల్లో చైన్ లాగితే ఆయా పరిస్థితులకు అనుగుణంగా జరిమానాలు, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. తొలిసారి నేరం చేస్తే, సుమారు రూ. 1000 వరకు జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. పదే పదే ఇదే తప్పు చేస్తే జరిమానాతో పాటు శిక్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.
అలారం చైన్ ను ఏ పరిస్థితులలో ఉపయోగించాలంటే?
అలారం చైన్ అనేది రైల్వే ప్రయాణీకులకు ఆపద వచ్చిన సమయంలో ఉపయోగించేలా రూపొందించారు. దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు చైన్ లాగవచ్చు. అటు గుండెపోటు, మూర్ఛ సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే సమయంలో అలారం చైన్ ను లాగే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో మాత్రమే అలారం ఉపయోగించాల్సి ఉంటుంది. అలారం చైన్ ను ఎమర్జెన్సీ పరిస్థితులలో కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిస్తే మిస్ యూజ్ చేసినట్లు రైల్వే అధికారులు భావిస్తారు. నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా అనధికారిక ప్రదేశాల్లో చైన్ లాగి రైలు ఎక్కడం, దిగడం లాంటివి చేస్తే నేరంగా పరిగణిస్తారు.
Read Also: స్పెయిన్ లో అర్ధరాత్రి అలజడి.. రైళ్లలోనే ప్రయాణీకులు బంధీ, అసలు ఏమైంది?
ఒకవేళ అనవసరంగా చైన్ లాగితే?
అనవసరంగా రైల్లో చైన్ లాగితే సెక్షన్ 141 ప్రకారం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. అలారం చైన్ లాగితే సాధారణ జరిమానాతో పాటు ఆయా పరిస్థితులకు అనుగుణంగా అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. రైలు ఆపి వెళ్లేందుకు అవసరమైన ఖర్చును కూడా వసూళు చేస్తారు. ఒకవేళ రైలు ఆగడం వల్ల ఇతర రైళ్లు తీవ్ర ప్రభావానికి గురైతే అదనపు ఛార్జీలు కూడా విధించే అవకాశం ఉంటుంది. డబ్బులు చెల్లించకపోతే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అందుకే, రైల్లో అలారం చైన్ ను అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు రైల్వే అధికారులు.
Read Also: మన రైల్వే స్లీపర్ క్లాస్ లో 15 గంటలు ప్రయాణించిన విదేశీయుడు.. దెబ్బకు ఆస్పత్రిపాలు!