Cable Theft In Spain: స్పెయిన్ లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 10 కిలో మీటర్ల మేర కాపర్ కేబుల్ ను దొంగిలించారు. ఈ దెబ్బతో పలు హైస్పీడ్ రైళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రయాణీకులు రైళ్లలోకి చిక్కుకుని నరకయాతన అనుభవించారు. వెంటనే స్పందించిన టెక్నికల్ టీమ్ గంటల తరబడి కష్టపడి కేబుల్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైస్పీడ్ రైలు సేవలు పునః ప్రారంభం అయ్యాయి.
10 కిలో మీటర్ల మేర కేబుల్ దొంగతనం
ఆదివారం సాయంత్రం సమయంలో స్పెయిన్ లోని మాడ్రిడ్- అండలూసియా ప్రాంతంలో హైస్పీడ్ రైళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. కొన్నిరైళ్లు రైల్వే స్టేషన్లలో ఆగిపోగా, మరికొన్ని మార్గ మధ్యలోనే నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. రైళ్లలో చిక్కుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు రైళ్లు ఎందుకు నిలిచిపోయాయి? అనే విషయంపై ఆరా తీశారు. దొంగతనం కారణంగా రైలు సేవలు నిలిచిపోయినట్లు గుర్తించారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో 10 కిలో మీటర్ల మేర కాపర్ కేబుల్ ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. వెంటనే ఆయా ప్రాంతాల్లో రైలు సేవలను పునరుద్ధరించేందుకు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. దొంగతనానికి గురైన కేబుల్ స్థానంలో కొత్త కేబుల్ ను అమర్చారు. ఆ తర్వాత రైళ్లు యథావిధిగా సేవలను అందించాయి.
ప్రయాణీకుల నరకయాతన
అటు రైళ్ల రాకపోకలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొందరు రైళ్లలోనే చిక్కుకుంటే, మరికొంత మంది రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. మాడ్రిడ్ లోని అటోచా స్టేషన్ లో వేలాది మంది ప్రజలు వేచి చూడాల్సి వచ్చింది. గత వారం దేశ వ్యాప్తంగా బ్లాక్ అవుట్ సమయంలో వందలాది మంది ప్రయాణికులు రైళ్లలో చిక్కుకుని అవస్థలు పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఇలా జరిగింది. “గత రెండు వారాల్లో రెండుసార్లు ఇలా జరిగింది. ఇంతకీ అసలు ఏం జరుగుతంది?” అని ఓ ఫారిన్ నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అటు మొత్తం తొమ్మిది రైళ్లు స్టేషన్ల మధ్య నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులు రాత్రిపూట రైల్లోనే గడపాల్సి వచ్చిందని వెల్లడించారు.
దొంగతనపై ప్రభుత్వం సీరియస్
హైస్పీడ్ రైలు దొంగతనంపై స్పెయిన్ రవాణాశాఖ మంత్రి ఆస్కార్ ప్యూంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన విధ్వంసక చర్యగా అభివర్ణించారు. దొంగలను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రజా రవాణాను డీకార్బనైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా స్పెయిన్ లో హై స్పీడ్ నెట్ వర్క్ వేగంగా విస్తరించింది. ఈ నెట్ వర్క్ దాదాపు అన్ని పెద్ద నగరాలను కలుపుతుంది. అయితే, ఈ మార్గాలు పలు గ్రామీణ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తరచుగా దొంగలు కేబుల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దొంగతనాలకు తావు లేకుండా తగిన సెక్యూరిటీ చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను రవాణామంత్రి ఆదేశించారు.
Read Also: బిచ్చగాడి వందేభారత్ ప్రయాణం, ఇదీ అసలు కథ!