India Railway Rules: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే(Indian Railway) సంస్థ ఒకటి. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో భారత్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు 7,303 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రోజు 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ఇందులో సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు కాగా, మిగతావి గూడ్స్ రైళ్లు.
తక్కువ ఖర్చులో ఆహ్లాదక ప్రయాణం
భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడుతారు. ప్రయాణీకులు సులభంగా రైల్వే ప్రయాణం చేసేలా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్(Railway Rules) అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందులో భాగంగానే అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి వచ్చే ప్యాసింజర్ల కోసం కొత్త నియమాలను రూపొందించింది. అర్జంట్ గా జర్నీ చేయాల్సి ఉన్న వాళ్లకు కనీసం టికెట్లు కొనే సమయం కూడా ఉండదు. ఆ సమయంలో టికెట్ లేకుండానే రైలు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టికెట్ లేకుండా రైలు ప్రయాణం ఎలా?
అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సిన వాళ్లు ఆదరాబాదరాగా రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అప్పటికే రైలు ప్లాట్ ఫారమ్ మీద ఆగి ఉంటే టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు. టికెట్ తీసుకోలేదనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, ఫ్లాట్ ఫారమ్ టికెట్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే మీరు రైలు ఎక్కడ ఎక్కారో చెప్పేందుకు ఈ టికెట్ ఉపయోగపడుతుంది. మీరు రైలు ఎక్కగానే వెంటనే టీటీఈని కలవాలి. టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కిన విషయాన్ని అతడికి వివరించాలి. అతడు కొంత ఫైన్ విధించి, మీకు టికెట్ అందిస్తాడు. అయితే, బెర్తు ఖాళీగా ఉంటేనే కేటాయిస్తాడు. లేదంటే సీటు లేకుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
Read Also: ఏంటీ.. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 600 రైళ్లు రాకపోకలు చేస్తాయా?
ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటే?
భారతీయ రైల్వే ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. ఒకవేళ టికెట్ లేకుండా పట్టుబడితే రూ. 250 వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుంచి మీరు దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పిన విషయంతో టీటీఈ కన్విన్స్ కాకపోతే, రూ. 1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. సో, టికెట్ లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, సీటు దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. అత్యవసరం సమయాల్లో ప్రయాణీకులు ఈ అవకాశన్ని ఉపయోగించుకోవచ్చు.
Read Also: టికెట్ ఛార్జీలపై 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్.. మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్!