Indian Railways festival trains: రైల్వే ప్రయాణికులకు కొండంత ఊపిరిపీల్చుకొనే శుభవార్త అంటే ఇదే. దీపావళి, దసరా, దుర్గాపూజా, ఛఠ్ పండుగల సమయంలో వందలాది రూపాయలు ఖర్చుపెట్టి బస్సులు, టాక్సీలలో ప్రయాణించడం ఇక మానేయండి. రైలు టికెట్ దొరకక పోతుందేమో అన్న ఆందోళన కూడా ఇక ఉండదు. ఎందుకంటే ఈసారి ఇండియన్ రైల్వే ప్రజల కోసం ప్రత్యేకమైన ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఉత్తర భారతదేశానికి వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వే డిపార్ట్‌మెంట్ సాంకేతికతను వినియోగించి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
రైల్వే ప్లాన్ అదిరింది!
ఈ ఏడాది అన్ని ప్రధాన పండుగలు దసరా, దీపావళి, దుర్గాపూజా, ఛఠ్ అక్టోబర్‌లోనే జరిగేలా వస్తున్నాయి. పండుగల సమయంలో సొంత ఊర్లకు వెళ్లే ప్రజలకు ఇది నిజంగా ఓ టెన్షన్ టైం అవుతుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల నుంచి యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్తున్నవారికి టికెట్ దొరకడం అసాధ్యం అయిపోతుంది. బస్సులు కట్ చేసుకుంటే ఖరీదు భారీగా ఉంటుంది, టాక్సీలైతే వందల కాదు.. వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి రైల్వే ముందుగానే ప్లాన్ చేసుకుంది.
రంగంలోకి ఏఐ..
రైల్వే ఈసారి ఏకంగా AI టెక్నాలజీతో పండుగ టికెట్ ప్లానింగ్ చేస్తోంది. అంటే గత ఏడాది ప్రయాణించిన డేటాను, స్టేషన్ టూ స్టేషన్ ట్రాఫిక్ సమాచారం, సీటింగ్ డిమాండ్‌లను పరిశీలించి.. ఈసారి ఎక్కడెక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుందో, ఎన్ని ట్రైన్లు వేసినా సరిపోతుందో అన్నది ముందుగానే అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా అదనపు ట్రైన్లు, అదనపు బోగీలను కలిపే ఏర్పాట్లు చేస్తుంది. అంటే ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందే సౌకర్యంగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
120 కాదు 60 రోజుల ముందే!
ఇంతకుముందు 120 రోజుల ముందే టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యేది. కానీ ఇప్పుడు 60 రోజుల ముందే టికెట్ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. దీని వల్ల టికెట్ మాఫియా, అక్రమ రిజర్వేషన్లకు చెక్ పడుతుంది. నిజంగా వెళ్లే వ్యక్తికే టికెట్ దొరికేలా చూసేందుకు ఇది మంచి మార్గం అవుతుంది. ఇదే కాకుండా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని ట్రైన్‌లు పూర్తిగా ఉత్తర భారతదేశానికి డైరెక్ట్ సర్వీసులుగా ఏర్పాటు చేస్తారు.
6 కోట్ల మంది ప్రయాణీకుల కోసం రైల్వే సిద్ధం!
గత ఏడాది పండుగ సీజన్‌లో రైల్వే సమాచారం ప్రకారం, సుమారు 6 కోట్ల మందికిపైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నుంచి యూపీ, బీహార్ వెళ్లే రూట్లలోనే అత్యధిక రద్దీ కనిపించింది. ఈ సారి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే ముందుగానే ఐడియా వేసింది. AI ఆధారంగా రూట్ వారీగా ప్రయాణికుల రద్దీని అంచనా వేయించి, సమయానికి ముందే అదనపు సర్వీసులు, మరిన్ని బోగీలు కలిపే ఏర్పాటు చేస్తోంది.
Also Read: Railways new coach policy: ప్రయాణికులకు శుభవార్త.. ఆ రైళ్లకు ఒకే తరహా కోచ్‌లు.. లాభం ఏంటంటే?
డోంట్ వర్రీ.. సీటు ఉంది!
రైల్వే అధికారుల మాటల్లో చెప్పాలంటే.. ఈసారి ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదు. టికెట్ దొరకదేమో అన్న భయం వద్దు. ఎవరైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా సీటు దొరుకుతుంది. ఖరీదైన టాక్సీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రద్దీ బస్సుల్లో వెళుతూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే విశ్వాసంగా ఉండాలనే మా లక్ష్యమని రైల్వే అధికారులు అంటున్నారు.
దీనికి తోడు, ఈ ప్రత్యేక పండుగ సీజన్ కోసం నూతన కోచ్‌లు ప్రవేశపెడుతున్నారు. ఇవి కేవలం ఆకర్షణీయంగా ఉండడమే కాదు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని సురక్షితమైనవిగా రూపొందించబడ్డాయి. శుభ్రమైన టాయిలెట్లు, విశాలమైన గ్యాంగ్‌వేస్, నాయిస్ లెవెల్ తక్కువగా ఉండే డిజైన్, సీటు ఎర్గోనామిక్స్ ఇలా అన్ని విషయాల్లోనూ కొత్తదనంతో కూడిన కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
మొత్తం చెప్పాలంటే.. ఈసారి పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణికులకు మధురానుభూతిని కలిగించేందుకు ముందే అడుగులు వేస్తోంది. మీరు కూడా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే IRCTC పోర్టల్‌లో మీ రూట్ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఈసారి పండుగ మీ ఇంట్లోనే కాదు.. ట్రైన్‌లో కూడా సంతోషంగా జరుపుకోండి!