Indian Railways Ticket Rules: రైళ్లో ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం వల్ల బెర్త్ కచ్చితంగా లభిస్తుంది. అయితే, కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. లేదంటే వాయిదా పడుతుంది. ఆ సమయంలో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. రైలు బయల్దేరే సమయాన్ని బట్టి టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని రీఫండ్ ఇస్తారు. అయితే, ఇకపై టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి అవసరం లేదు. మీ టికెట్ ద్వారా ఇతరులు ప్రయాణించే అవకాశం కల్పించింది భారతీయ రైల్వే. ఈ విధానం వల్ల మీకు పూర్తి డబ్బులు వస్తాయి. ఇతరులు హాయిగా కన్ఫార్మ్ టికెట్ తో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ కొత్త రూల్ ను ఎలా ఉపయోగించుకోవాలంటే..
మీ టికెట్ తో ఇతరులు ప్రయాణించడం ఎలా?
అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ అయిన వారికి టికెట్ మార్పిడి సౌకర్యాన్ని కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. అయితే, ఓ కండీషన్ పెట్టింది. మీ టికెట్ మీద ప్రయాణం చేయాల్సిన వాళ్లు మీ కుటుంబ సభ్యులు అయి ఉండాలి. అప్పుడే మీ టికెట్ మార్చుకోవచ్చు. మీ టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే, మీ రిజర్వేషన్ టికెట్ మీద కేవలం మీ కుటుంబ సభ్యులే జర్నీ చేసే అవకాశం ఉంటుంది.
మీరు టికెట్ ఎలా మార్పిడి చేసుకోవాలంటే?
మీ టికెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా.. కౌంటర్ లో బుక్ చేసుకున్నా, ఇతరులకు మార్పిడి చేయాలంటూ రైల్వే స్టేషన్ లోని కౌంటర్ కు వెళ్లాల్సిందే. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్లే సమయంలో టికెట్ ప్రింట్ అవుట్ తో పాటు ప్రయాణించే వ్యక్తి గుర్తింపు కార్డు జీరాక్స్ ను తీసుకెళ్లాలి. అక్కడ టికెట్ ఛేంజ్ ఫారమ్ నింపి ఇవ్వాలి. కౌంటర్ లోని సిబ్బంది మీ వివరాలను పరిశీలించి టికెట్ మీద పాత ప్రయాణీకుడి పేరు కొట్టివేసి , కొత్తగా ప్రయాణించే వారి పేరును ఎంటర్ చేస్తారు. అయితే, టికెట్ మార్పిడి అనేది రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు వరకే చేస్తారు.
బోర్డింగ్ స్టేషన్ ఆప్షన్ ను మార్చుకునే అవకాశం
మీరు టికెట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత మీ బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కారణాలతో మీరు ముందుగా అనుకున్న బోర్డింగ్ స్టేషన్ లో రైలు ఎక్కలేకపోతే, బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీరు టికెట్ వేరే వాళ్లకు ట్రాన్స్ ఫర్ చేసిన వాళ్లు కూడా ఆ స్టేషన్ నుంచి ఎక్కలేకపోతే, బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవచ్చు. IRCTC వెబ్ సైట్ ద్వారా సింపుల్ గా ‘బోర్డింగ్ పాయింట్ ఛేంజ్’ ఆప్షన్ ను ఎంచుకుని మీ బోర్డింగ్ అప్షన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది.
Read Also: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?