Amit Shah: ఏపీ బీజేపీకి నేతలకు హోం మంత్రి అమిత్ షా చేసిన కీలక సూచనలేంటి? పార్టీని గాడిలో పెట్టేందుకు ఎలాంటి సలహాలు ఇచ్చారు? కొత్త అధ్యక్షుడి విషయంలో నేతల నుంచి ఎలాంటి సమాచారం తీసుకున్నారు? వైసీపీ గ్యాప్‌ని ఫుల్ చేసే పనిలో నేతలు నిమగ్నం అవుతారా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
శనివారం రాత్రి విజయవాడకు వచ్చారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశ మయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో ఆదివారం ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.
నోవాటెల్‌లోని ఏడవ అంతస్తులో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు మరో 20 మంది నాయకులు హాజరయ్యారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు.
ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించారు అమిత్ షా. ఈ క్రమంలో కొందరు నేతలకు క్లాస్, మరికొందరికి మాస్ వార్నింగ్ ఇచ్చారట షా. ఎవరు ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తే బాగుందని, అంతర్గత విభేదాలు పక్కన పెట్టాలన్నది ప్రధాన పాయింట్.
ALSO READ: తోపుదుర్తికి ఊహించని ఝలక్, కేసు నమోదు
ఏపీకి ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు అమిత్ షా. ఏపీలో వైసీపీ వీక్‌గా ఉందని, ఆ గ్యాప్‌ని తాను మళ్లీ వచ్చేసరికి భర్తీ చేయాలన్నారట. పార్టీ బలోపేతానికి నేతలంతా కృషి చేయాలని ఆదేశించారు. అలాగే హైందవ శంఖారావం సభ విజయవంతం కావడంపై వీహెచ్‌పీ, పార్టీ నేతలను అభినందించారు అమిత్ షా.
కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై అమిత్ షా తన నిర్ణయాన్ని చెబుతారని చాలామంది భావించారు. కనీసం అభిప్రాయమైనా తీసుకుంటారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ రాలేదన్నది కొందరి నేతల మాట. ఒక విధంగా చెప్పాలంటే రాబోయే నాలుగున్నరేళ్లు పార్టీ బలోపేతంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. తోక జాడించేవారికి సున్నితంగా హెచ్చరించినట్టు పార్టీ వర్గాల సమాచారం.