Indian Railways Kavach 4.0: ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు.. బ్రేక్ వేసే సమయం లేదు.. దట్టమైన పొగ.. బయట సిగ్నల్ కనబడడం లేదు.. కానీ లోకో పైలట్‌కి టెన్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ లో కవచ్ 4.0 ఉందిగా! ప్యాసింజర్స్ భద్రతకు అధునాతన టెక్నాలజీని ఇండియన్ రైల్వే తెచ్చింది. అదేమిటి? ఎలా పని చేస్తుంది? తెలియాలంటే ఈ పూర్తి కథనం తప్పక చదవండి.
రైల్వే ప్రయాణాలు ఇక ముందు మరింత భద్రంగా మారనున్నాయి. భారతీయ రైల్వే భద్రతను మోడర్న్ టెక్నాలజీతో, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద అభివృద్ధి చేసిన కవచ్ 4.0 అనే దేశీయ ట్రైన్ రక్షణ వ్యవస్థను కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించింది. తాజాగా ఢిల్లీ – ముంబయి హైడెన్సిటీ రూట్‌లోని మథురా – కోట సెక్షన్‌లో ఈ సిస్టమ్ విజయవంతంగా అమలు కావడం ఇండియన్ రైల్వే భద్రతా రంగంలో ఎన్నో రేట్లు ముందంజలో ఉందని చెప్పవచ్చు.
❄ ఐడియా మనదే.. క్రెడిట్ మనదే
కవచ్ 4.0 అనేది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది రైళ్లు పరస్పరం ఢీకొనే ప్రమాదాలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. రైలు వేగం, దిశ, ట్రాక్ స్టేటస్ వంటి అంశాలపై పక్కాగా డేటా ఇచ్చి, లోకో పైలట్‌లను సత్వర నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ వ్యవస్థ సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవల్ – 4 (SIL-4) స్టాండర్డ్‌ను పాటిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత భద్రతా ప్రమాణంగా పరిగణించబడుతోంది.
ఈ సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి 2015లో ప్రారంభమై, 2018లో మొదటి ఆపరేషనల్ సర్టిఫికేట్ పొందింది. ఇప్పుడు కొత్తగా 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లకు వర్తించేలా మే 2025లో కవచ్ 4.0 ఆమోదం పొందింది. అంతేగాక, ఇందులో ఉపయోగించే అన్ని భాగాలు భారత్‌లో తయారు అవుతున్నాయి.
❄ ఎలా పని చేస్తుందంటే?
కవచ్ వ్యవస్థ సాధారణంగా ఒక ట్రైన్‌కు బ్రేక్ వేసే పద్ధతి మాత్రమే కాదు. ఇది ఒక బహుళ భాగాల కలయికతో పనిచేసే కాంప్లెక్స్ టెక్నాలజీ సిస్టమ్. ఇందులో RFID ట్యాగ్లు, టెలికాం టవర్లు, డాష్‌బోర్డ్ ఇంటర్ఫేస్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు ఉంటాయి. ప్రతి కిలోమీటరుకు ఒక RFID ట్యాగ్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రైన్ తూర్పు, పడమర వైపునే కాకుండా నిమిషానికో సెకండ్ స్థాయిలో ఎక్కడ ఉందో అంచనా వేయగలుగుతుంది.
అలాగే టెలికాం టవర్ల ద్వారా రైలు లోకోమోటివ్, కంట్రోల్ రూమ్ మధ్య నిరంతర కమ్యూనికేషన్ ఉంటుంది. దీని వలన చాలా చురుకైన స్పందన సాధ్యమవుతుంది. రైలు లోపలే డాష్‌బోర్డుపై లోకోపైలట్‌కు అవసరమైన సమాచారం చూపించడం వలన, బయట కనిపించే సిగ్నల్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు.
❄ భవిష్యత్తు ఇంజనీర్లకు ట్రైనింగ్.. చదివే రోజుల్లోనే కవచ్ నేర్పిస్తున్నారు!
ఇతర సాంకేతిక రంగాల మాదిరిగానే, కవచ్ 4.0కు అవసరమైన నిపుణుల కోణంలోనూ భారతీయ రైల్వే ముందడుగు వేసింది. ఇప్పటికే 30,000 మందికిపైగా సిబ్బందికి కవచ్ 4.0పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతేగాక, IRISET సంస్థ 17 AICTE అప్రూవ్ చేసిన ఇంజనీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం చేసి, BTech సిలబస్‌లో కవచ్ టెక్నాలజీని చేర్చింది. దీని వలన రాబోయే ఇంజనీర్లు విద్యార్థిదశలోనే ఈ అత్యాధునిక భద్రతా వ్యవస్థపై ప్రావీణ్యం పొందగలుగుతారు.
❄ భారీ పెట్టుబడులతో భద్రత మీద దృష్టి..
ఇండియన్ రైల్వే రక్షణ రంగంలో ఏటా రూ. 1 లక్ష కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. ఈ ఖర్చులో ముఖ్యమైన భాగం కవచ్ వ్యవస్థకి కేటాయించబడింది. ఇప్పటివరకు 5,856 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్, 619 టెలికాం టవర్లు, 708 స్టేషన్లలో కవచ్ వ్యవస్థ, 1,107 లోకోమోటివ్‌లలో వ్యవస్థ అమలు అయ్యాయి. అలాగే 4,001 కిలోమీటర్ల ట్రాక్‌సైడ్ పరికరాలు అమలయ్యాయి. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఈ వ్యవస్థను త్వరితగతిన అమలు చేయడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రూట్లపై ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులోకి రావడం ఖాయం.
❄ పరిపూర్ణ భద్రతే లక్ష్యం.. ప్రయాణికులకు ఇది గొప్ప భరోసా
ఇప్పటికిప్పుడు కవచ్ అమలవుతున్న మార్గాల్లో, డ్రైవర్లకు అవాంతరంగా కనిపించే పొగ, మంచు వంటి పరిస్థితుల్లో కూడా స్పష్టమైన మార్గదర్శనం లభిస్తోంది. నిబంధనలకు కట్టుబడి ఉండటంతో పాటు, ఈ సిస్టమ్ ద్వారా మానవ పొరపాట్లను తక్కువ చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల రైళ్లు సమయానికి, భద్రతతో చేరుకునే అవకాశాలు మరింత మెరుగవుతాయి.
❄ మొత్తం విషయాన్ని చర్చిస్తే…
కవచ్ 4.0 ఒక రైల్వే టెక్నాలజీ మార్గంలో దేశ స్వయంప్రతిష్టను, భద్రతా విజ్ఞానాన్ని ప్రదర్శించే మైలురాయి. ఇది కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు.. ఇది దేశంలోని కోట్లాది రైల్వే ప్రయాణికులకు భద్రతా హామీ, రైలు సిబ్బందికి సహాయక మార్గదర్శక వ్యవస్థ, టెక్నాలజీ రంగానికి గర్వకారణం. ఇండియన్ రైల్వే తీరును పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు ఈ కవచ్ 4.0 ఒక శక్తివంతమైన ఆయుధం. భద్రతగా, వేగంగా, సాంకేతికంగా ముందుకెళ్తున్న ఇండియన్ రైల్వే… ఇక ముందు ప్రయాణం కొత్త అనుభూతినే కలిగించనుంది.