భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణాలు చేస్తారు. చాలా మంది ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ, పేద ప్రయాణీకులు అప్పటికప్పడు జనరల్ టికెట్ కొనుగోలు చేసి రైలు ఎక్కుతారు. ఈ టికెట్ కౌంటర్లు సాధారణంగా రైల్వే స్టేషన్లలో ఉంటాయి. ఇకపై ఈ కౌంటర్లను మూసివేయాలని భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కౌంటర్లలో పని చేసే సిబ్బందిని ఇతర చోట్ల విధులు అప్పగించాలని భావిస్తోంది. రైల్వే కౌంటర్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి త్వరలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది.
ప్రైవేట్ ఏజెన్సీల చేతికి జనరల్ టికెట్ కౌంటర్లు
ప్రస్తుతం ఉన్న జనరల్ టికెట్ కౌంటర్లలో టికెట్లు జారీ చేసే పనిని ప్రైవేట్ ఏజెన్సీల అప్పగించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. రిజర్వ్ చేయని టికెట్లను జారీ చేయడానికి ఎంపిక చేసిన స్టేషన్లలో మొబైల్ UTS (M-UTS) అసిస్టెంట్లను నియమిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్, దశలవారీగా విస్తరించనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. జనరల్ టికెట్ కౌంటర్ సిబ్బంది సంఖ్యను తగ్గించడం, వారిని ఇతర విభాగాలకు కేటాయించడం ముందుగా చేయనుంది. ఆ తర్వాత కాంట్రాక్టు ప్రాతిపదికన UTS అసిస్టెంట్లను నియమించనుంది.
రైల్వే స్టేషన్ల లోపల, వెలుపల ప్రైవేట్ టికెటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే చాలా యాక్టివ్ గా ఉన్నాయి. వాటిలో, జన్ సాధారణ్ టికెట్ బుకింగ్ సేవక్ (JTBS) కౌంటర్లు 2019 నుంచి అందుబాటులో ఉన్నాయి. తరువాత, స్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (ATVMలు) ఏర్పాటు చేశారు. రిటైర్డ్ రైల్వే సిబ్బంది కూడా ఈ యూనిట్ల ఏర్పాటు కాంట్రాక్టు తీసుకుని నడిపిస్తున్నారు. ఆ తర్వాత స్టేషన్ టికెట్ బుకింగ్ ఏజెంట్లు (STBA) అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కేరళ అంతటా అనేక స్టేషన్లు ఇప్పుడు ఈ మోడల్ లోనే పనిచేస్తున్నాయి. ఈ ఏజెంట్లు కమిషన్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.
Read Also: 1,000 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్, బుల్లెట్ రైలు సేవలు ఎప్పటి నుంచి అంటే?
తత్కాల్, జనరల్ టికెట్ బుకింగ్ సేవలు ఒకేచోట!
తత్కాల్ బుకింగ్‌లను నిర్వహించే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లను ఇంటిగ్రేటెడ్ అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (IUTS) కౌంటర్లుగా మార్చడం ద్వారా సిబ్బందిని తగ్గించడానికి రైల్వేలు ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇవి నిర్ణీత సమయాల్లో రిజర్వేషన్ కౌంటర్లుగా పనిచేస్తాయి. ఆ తర్వాత సాధారణ UTS కౌంటర్లుగా పనిచేస్తాయి. అలాంటి స్టేషన్లలో, స్టేషన్ మాస్టర్ రాత్రిపూట రిజర్వ్ చేయని టికెట్లను జారీ చేస్తారు. అయితే, కొన్నిచోట్ల భద్రతా సమస్యలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో దక్షిణ రైల్వే ఇప్పుడు టికెట్ అమ్మకాలు, ప్రయాణ సమాచార సేవలకు సంబంధించిన విధుల నుంచి స్టేషన్ మాస్టర్‌లను తొలగించాలని నిర్ణయించింది. ఇకపై జనరల్ టికెట్ల జారీని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రయాణీకులకు వేగంగా, మరింత మెరుగ్గా సేవలను అందించడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: జపానోళ్లది బుర్రే బుర్ర.. ఎయిర్ లైన్స్ లోకి అదిరిపోయే టెక్నాలజీ, ఇది ఊహించలేరు!