Japan Airlines: జపాన్ ఎయిర్ లైన్స్ సరికొత్త టెక్నాలజీ సాయంతో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించబోతోంది. టోక్యో హనేడా విమానాశ్రయంలో HALO అని పిలిచే నెక్ట్స్ జెనరేషన్ టెక్నాలజీని పరిచయ అమలు చేయబోతోంది. ఈ టెక్నాలజీలో భాగంగా గ్రౌండ్ ఆపరేషన్లలో కృత్రిమ మేధస్సును అమలు చేయనుంది. ఈ మేరకు అమెరికన్ కంపెనీ మూన్ వేర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రీసోర్స్ మేనేజ్ మెంట్, కోఆర్డినేషన్, రియల్ టైమ్ నిర్ణయాలతో గ్రౌండ్ ఆపరేషన్ల సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రయాణీకులకు మరిన్ని ప్రయోజనాలను అందించనుంది. జపాన్ ఎయిర్ లైన్స్ విమానాలు, కార్యకలాపాలను మరింత ఆధునీకరించబోతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణాలు మరింత సులభతరం, వేగవంతం కానున్నాయి.
ఇంతకీ HALO అంటే ఏంటి?
HALO వ్యవస్థ వేగవంతమైన, మరింత సమర్థవంతమైన గ్రౌండ్ కార్యకలాపాలను నిర్వహించేలా సాయపడే టెక్నాలజీ. చెక్ ఇన్ వెయిటింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వేగవంతమైన లగేజీ మెయింటెనెన్స్ తో పాటు విమానాలు సమయానికి బయల్దేరేలా సాయపడుతుంది. రియల్-టైమ్ అప్ డేట్స్ తో పాటు మెరుగైన సమన్వయంతో, ప్రయాణీకులకు విమానాశ్రయ అనుభవం మరింత ఈజీగా మారుతుంది.
స్మార్ట్ కోఆర్డినేషన్
HALO అనేది గ్రౌండ్ సిబ్బంది రియల్ టైమ్ వర్క్ చేయడంలో సాయపడుతుంది. వాతావరణం, ఆపరేషన్లలో లోపాలు, ఇతర అంశాల కారణంగా చివరి క్షణంలో ఏవైనా మార్పులు సంభవించినా వాటిని పరిగణనలోకి తీసుకునేలా అలర్ట్ చేస్తుంది. ప్రయాణికులకు మరింత సమర్థవంతమైన కార్యకలాపాలు, తక్కువ నిరీక్షణ, భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ప్రయాణీకులు విమానంలో ప్రయాణిస్తున్నా, లగేజీని పొందుతున్నా, ఇతర గ్రౌండ్ ఆపరేషన్స్ లో మంచి సర్వీసు అందేలా సాయపడుతుంది.
ఒత్తిడి లేని ప్రయాణ అనుభవం
HALO అనేది ప్రయాణీకులకు ఒత్తిడి లేని ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందుకోసం రియల్ టైమ్ అప్ డేట్స్ అందిస్తుంది. ఒకవేళ విమానంలో లేదంటే గేట్ లో మార్పులు చేసినప్పుడు వెంటనే జపాన్ ఎయిర్ లైన్స్ నుంచి వెంటనే అప్ డేట్ అందుతుంది. అంటే ప్రయాణీకులు కచ్చితమైన, తాజా సమాచారాన్ని పొందుతారు. జపాన్ ఎయిర్ లైన్స్ లో ఏవైనా మార్పులు, జాప్యాల గురించి మీకు త్వరగా అప్ డేట్ అందుతుంది. అనవసరమైన ఒత్తిడి లేకుండా మీ ప్రణాళికలను సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. గ్రౌండ్ ఆపరేషన్లు చెక్-ఇన్ నుంచి బయలుదేరే వరకు మరింత సమర్థవంతంగా కొనసాగిస్తుంది.
జపాన్ ఎయిర్‌లైన్స్ HALO భాగస్వామ్యం
జపాన్ ఎయిర్ లైన్స్ టోక్యో హనేడా విమానాశ్రయంలోని గ్రౌండ్ ఆపరేషన్స్ లో HALO వ్యవస్థను అమలు చేసే విషయంలో ప్రముఖ కృత్రిమ మేధస్సు సాంకేతిక సంస్థ మూన్ వేర్ తో జతకట్టింది. ఈ భాగస్వామ్యం గ్రౌండ్ కార్యకలాపాలను మరింత పక్కగా అమలయ్యేలా చేస్తుంది. HALO స్మార్ట్ సిస్టమ్ కార్యకలాపాలను సులభతరం చేయడమే కాకుండా గ్రౌండ్ వర్క్ నిర్వహణలో భద్రత, కచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గించడానికి, సరైన భద్రతా చర్యలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని నిర్ధారించుకోవడానికి సర్టిఫైడ్ కార్మికులకు మాత్రమే ఉద్యోగాలు కేటాయించబడుతున్నాయని ఈ టెక్నాలజీ నిర్ధారిస్తుంది.
ఆధునిక విమానాలకు మరింత సపోర్టు
HALOలో జపాన్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడి కేవలం కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం గురించి మాత్రమే కాదు. ఇది ఎండ్ టు ఎండ్ ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం గురించి కూడా. జపాన్ 38 బోయింగ్ 737 MAX 8 విమానాలను ఆర్డర్ చేయడం ద్వారా ఎయిర్‌లైన్ తన విమానాలను కూడా అప్ గ్రేడ్ చేస్తోంది. ఈ విమానాలు మరింత సమర్థవంతమైన ఇంధన వినియోగం, మరింత ఆహ్లాదకరమైన క్యాబిన్లను అందిస్తుంది. ఇవన్నీ కస్టమర్లకు మరింత ఆనందదాయకమైన, పర్యావరణ అనుకూలమైన ప్రయాణానికి దోహదం చేస్తాయి. భవిష్యత్తులో నిశ్శబ్ద విమానాలు, తక్కువ జాప్యం, తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాల ద్వారా ఈజీగా ప్రయాణించే అవకాశాన్ని పొందుతారు.
Read Also: 1,000 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్, బుల్లెట్ రైలు సేవలు ఎప్పటి నుంచి అంటే?