IRCTC, ఇండియన్ రైల్వే రైల్ కనెక్ట్ యాప్ తో సహా అన్ని రైల్వే టికెట్ బుకింగ్ యాప్‌లు ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు పని చేయవని భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణీకులు నవంబర్ 1న అంటే.. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవడం, ఇంటర్నెట్ టికెట్ బుకింగ్, ఎంక్వయిరీ లాంటి సేవలను యాక్సెస్ చేయలేరని తెలిపింది. అన్ని రకాల రైల్వే సేవలను 6 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. IRCTC, CRIS ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థల అప్ గ్రేడ్ కారణంగా, రైల్వే యాప్ ఆధారిత ఇ టికెటింగ్ వ్యవస్థ పనిచేయదని తెలిపింది.
రైల్వే యాప్స్ అప్ గ్రేడ్ ప్రక్రియ నవంబర్ 1(శనివారం) రాత్రి 11:45 నుంచి నవంబర్ 2 (ఆదివారం) ఉదయం 5:30 వరకు రైలు టిక్కెట్ రిజర్వేషన్‌లు ప్రభావితమవుతాయని ఇండియన్ రైల్వే తెలిపింది. కోల్ కతాలోని IRCTC, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) సర్వర్లలో డేటా కంప్రెషన్, టెక్నాలజీ అప్ గ్రేడ్ లను నిర్వహించడానికి ఈ షట్ డౌన్ అమలు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఈ సమయంలో అన్ని కీలకమైన రైల్వే డేటాబేస్‌లు, ముఖ్యంగా PNR ఫైల్స్, రిజర్వేషన్ రికార్డులు మరింత ఆధునీకరించనున్నట్లు తెలిపింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను వేగంగా, భవిష్యత్ డిజిటల్ అవసరాలకు అనుగుణంగా మార్చడానికి కొంత సమయం పాటు IRCTC డౌన్ చేయాల్సి వస్తుందని తెలిపింది. షట్ డౌన్ సమయంలో కరెంట్ బుకింగ్, ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా 139 సేవలను ప్రయాణీకులు దాదాపు ఆరు గంటల పాటు పొందలేరని వెల్లడించింది. ఈ సమయంలో టికెట్ బుకింగ్ నుంచి విచారణ వరకు అన్ని సేవలు అందుబాటులో ఉండవన్నారు.
Read Also: మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?
వెబ్ సైట్ డౌన్ అయిన సమయంలో టిక్కెట్లను బుక్ చేసుకోవడం లేదంటే రద్దు చేసుకోవడం మానుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ప్రయాణం నవంబర్ 1 రాత్రి లేదంటే నవంబర్ 2న ఉదయం ఉంటే, ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ప్రయాణీకులకు ఇబ్బందిని తగ్గించేందుకే రాత్రిపూట సర్వర్ అప్ డేట్ చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. సిస్టమ్ అప్ గ్రేడ్ పూర్తయిన తర్వాత అన్ని సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు అధికారులు. ఈ అప్ గ్రేడ్ వల్ల వేగవంతమైన బుకింగ్, రియల్ టైమ్ అప్ డేట్స్ అందుతాయని రైల్వే అధికారులు తెలిపారు. అదే సమయంలో సర్వర్ డౌన్ లాంటి సాంకేతిక లోపాలు తగ్గుతాయన్నారు.
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!