Indian Railways: ప్రయాణీకులు ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేరేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిని ఫాలో అయితే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి చాలా మంది తరచుగా రైలు ప్రయాణం చేస్తున్నప్పటికీ రూల్స్ గురించి పెద్దగా తెలియదు. వాటిని తెలుసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి లగేజీ. ఒక్కో ప్రయాణీకుడు ఎంత లగేజీ తీసుకెళ్లాలి? అనే విషయం అవగాహన ఉండదు. కొన్నిసార్లు పరిమితికి మించి తీసుకెళ్లడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇంతకీ రైల్వే ప్రయాణం చేసే ప్యాసింజర్లు ఎంత మోతాదులో లగేజీ తీసుకెళ్లాలి? లగేజీ పరిమితి ఆయా క్లాసులకు వేర్వేరుగా ఉంటుందా? ఒకవేళ పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఏమవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక్కో ప్రయాణీకుడు లగేజీ ఎంత తీసుకెళ్లాలంటే?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఆయా తరగతులను బట్టి ఒక్కో ప్రయాణీకుడు 40 నుంచి 70 కిలోల వరకు ఉచితంగా లగేజీని తీసుకెళ్లవచ్చు. ఆయా క్లాస్ ను బట్టి లగేజీ పరిమితి ఆధారాపడి ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ ఏసీ కోచ్ లో జర్నీ చేసే ప్రయాణీకులు 70 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక సెకెండ్ ఏసీలో వెళ్లే ప్రయాణీకులు 50 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏసీ ప్రయాణీకులు 40 కిలలో లగేజీ తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు సైతం 40 కిలోల వరకు లగేజీని వెంట తీసుకెళ్లవచ్చు. ఒకేవేళ పరిమితికి మించి లగేజీని తీసుకెళ్లాల్సి వస్తే, ముందుగానే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతి లేకుండా ఎక్కువ మోతాదులో లగేజీ తీసుకెళ్తే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా జరిమానా విధిస్తారు.
Read Also: ఈ రైలు ముందు రాజధాని, శతాబ్ది, దురంతో దిగదుడుపే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
గతంలో లగేజీపై పరిమితులు ఉండేవా?
గతంలో రైల్వే ప్రయాణీకులకు తీసుకెళ్లే లగేజీ మీద భారతీయ రైల్వే ఎలాంటి పరిమితులు విధించేది కాదు. కానీ, రద్దీ సమయాల్లో ప్రయాణీకులు పెద్ద మొత్తంలో లగేజీ తీసుకురావడంతో కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తడాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత లగేజీ విషయంలో పరిమితులు విధిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా క్లాసులను బట్టి లగేజీని తీసుకెళ్లాల్సి ఉంటుందనే రూల్ తీసుకొచ్చారు. ఈ నిబంధన అమలులోకి రావడంతో గతంలో మాదిరిగా ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తడం లేదని అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ మొత్తంలో లగేజీ తీసుకెళ్లాల్సి వస్తే ముందుగానే అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇకపై రైలు ప్రయాణం చేసే సమయంలో పరిమితులకు లోబడి లగేజీని తీసుకెళ్లాలంటున్నారు.
Read Also: రైల్లో ప్రయాణించేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకూడదు, ఎందుకో తెలుసా?
Read Also: రన్నింగ్ ట్రైన్ లో నుంచి మీ బ్యాగ్ పడిపోయిందా? సింపుల్ గా ఇలా చేయండి!