Kerala CM Daughter Probe| కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కుమార్తె వీణా విజయన్ పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు రావడంతో కేంద్ర ఏజెన్సీలు విచారణ చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ (CMRL) కంపెనీకి సంబంధించిన నిధులను వీణా విజయన్ అక్రమంగా తన కంపెనీ అయిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కి బదిలీ చేసినట్లు అభియోగాలున్నాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ ప్రారంభించమని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వీణా విజయన్ నిందితురాలిగా ఉండగా.. ఆమెకు 6 నెలల నుంచి నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
కేసు వివరాలు:
సిఎంఆర్ఎల్ నుంచి ఆమెకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమంగా నిధులు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని సమాచారం. ఈ నేపథ్యంలో.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) కొచ్చి లోని ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్ ఆధారంగా కేంద్రం ఈ విచారణను శుక్రవారం అనుమతించింది. కొచ్చిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో ఈ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో 160 పేజీల ఛార్జ్‌షీట్ ని SFIO అధికారులు రూపొందించారు.
Also Read: అవినీతిపరులైన జడ్జిలకు శిక్షలు లేవా?.. కానీ టీచర్లను తొలగిస్తారా?.. సుప్రీంపై మండిపడిన దీదీ
పదేళ్ల జైలుశిక్ష అవకాశం:
సిఎంఆర్ఎల్ , ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీల మధ్య ఒక బిజినెస్ అగ్రీమెంట్ జరిగింది. ఈ అగ్రీమెంట్ ప్రకారం.. రూ.2.73 కోట్లు నిధులు సిఎంఆర్ఎల్ నుంచి ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి బదిలీ అయ్యాయి. 2017 నుండి 2020 వరకు CMRL కంపెనీ నుండి వీణా విజయన్ కంపెనీకి ఈ నిధుల బదిలీ జరిగింది. కానీ ఈ మొత్తానికి బదులు ఎటువంటి సేవలు సిఎంఆర్ఎల్ కంపెనీ పొందలేదు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి SFIO ఆదేశాలు జారీ చేసింది. SFIO ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్ తో పాటు CMRL మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ కార్త తో పాటు మరో 25 మంది నిందితుల పేర్లు చేర్చబడ్డాయి. వీణా విజయన్ దోషిగా తేలితే, కంపెనీస్ యాక్ట్ ప్రకారం.. ఆమెకు ఆరు నెలల నుంచి పది సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించబడే అవకాశం ఉంది. అలాగే అదనంగా జరిమానా కూడా విధించబడుతుంది.
కేరళ అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఫైర్
ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్‌ను నిందితురాలిగా చేర్చడం చాలా గంభీరమైన విషయం. SFIO ఛార్జ్‌షీట్ ఆమెపై ఆరోపణలను బలపరుస్తోంది. ముఖ్యమంత్రి కుమార్తె పదేళ్ల వరకు జైలుశిక్ష విధించదగిన నేరంలో పాల్గొనడం చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో, నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలి. ఆయన ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడం సముచితం కాదు. తన కుమార్తె విచారణను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి స్థానం లో ఉండడం ఆయన ఎలా సమర్థించగలరు?” అని ప్రశ్నించారు.
వీణా విజయన్ వివాహం..
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ వివాహం.. సీపీఐ (ఎం) పార్టీ యువక విభాగం డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు పీఏ మహమ్మద్ రియాజ్‌తో 2020లో జరిగింది. ఇది వారి రెండవ పెళ్లి కాగా మతాంతర వివాహం కావడం విశేషం. వీణా ముందుగా ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసి, తరువాత బెంగళూరులో ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను ప్రారంభించి, మేనేజింగ్ డైరెక్టర్‌గా విజయవంతంగా నడుపుతున్నారు. మహమ్మద్ రియాజ్ లాయర్‌గా పని చేస్తూ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు. 2017లో డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికై, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో కూడా సక్రియంగా ఉన్నారు.