Toyota Innova Hycross Facelift: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా భారత మార్కెట్లో మరో కీలక అప్‌డేట్ తో రాబోతోంది. తన పాపులర్ MPV ఇన్నోవా హైక్రాస్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను నవంబర్ 25న విడుదల చేయనుంది. 2022లో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కారుకు వస్తున్న ఫస్ట్ మెయిన్ అప్‌డేట్ ఇదే. కొత్త మోడల్‌లో డిజైన్‌తో పాటు ఇంటీరియర్, టెక్నాలజీ పరంగా పలు మార్పులు ఉండనున్నాయి. పెద్ద డిస్ ప్లేలు, కొత్త ఫీచర్లు, ఇథనాల్ నడిచే హైబ్రిడ్ ఇంజిన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది.
ఫేస్ లిఫ్ట్ మోడల్ లో ముందు భాగం మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. కొత్త గ్రిల్, సన్నగా ఉండే హెడ్ ల్యాంప్స్ తో పాటు అప్ డేటెడ్ బంపర్లు కనిపించే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో మార్పులు చేసిన టెయిల్ ల్యాంప్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుత మోడల్ కంటే కొత్త కారు మరింత మోడ్రన్ లుక్ లో రానుంది.
ఇన్నోవా హైక్రాస్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ లోనూ కీలక మార్పులు ఉండనున్నాయి. ఇటీవల ఇండోనేషియాలో విడుదలైన అప్ డేటెడ్ మోడల్ లోని కొన్ని ఫీచర్లను భారత వెర్షన్ లోనూ తీసుకురావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10.1 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ స్థానంలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ వేరియంట్లలో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేను కూడా అందించవచ్చు. పెట్రోల్ వేరియంట్లలో మాత్రం 7 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. కొత్త సీట్ అప్‌హోల్స్టరీ, అప్‌డేటెడ్ సాఫ్ట్ వేర్, ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఈ ఫేస్ లిఫ్ట్ లో ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. అయితే, E30, అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా ఇంజిన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. 2024లోనే టయోటా ఇథనాల్‌తో నడిచే ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇందులో 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను యాడ్ చేశారు. ఇప్పుడు అదే టెక్నాలజీని ప్రొడక్షన్ మోడల్ లో తీసుకొస్తే, దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్ లో ఇన్నోవా హైక్రాస్ ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది.
కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. అధికారిక ధరలు నవంబర్ 25న విడుదల సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: టాటా చరిత్రలో తొలిసారి.. జస్ట్ 10 నెలల్లోనే 6 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు!