రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో చిరు వ్యాపారులు, పల్లీలు, సమోసాలు, టీ, కాఫీ లాంటి తినబండారాలను అమ్ముతుంటారు. ప్యాసెంజర్లు కూడా వాటిని కొనుగోలు చేసిన తింటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, రైళ్లలో ఎలాంటి వస్తువులు అమ్మాలన్నా, రైల్వే సంస్థ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా రైళ్లలో అమ్మకాలు కొనసాగించడం చట్టరీత్యా నేరం. తాజాగా రైళ్లలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా నార్త్ లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
టీ తాగి అస్వస్థతకు గురైన ప్రయాణీకులు
రీసెంట్ గా ఆగ్రాలో ఓ రైలు బోగీలోకి ఓ చాయ్ అమ్మే వ్యక్తి వచ్చాడు. అతడి నుంచి పలువురు టీ కొనుగోలు చేశారు. కానీ, తాగడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వెంటనే, కొంత మంది వాంతులు చేసుకున్నారు. కోచ్ లో అతడి టీ తాగిన మిగతావారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని టీటీకి చెప్పారు. ఆయన రైల్వే పోలీసులతో పాటు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. చాయ్ అమ్మే వ్యక్తిని పట్టుకున్నారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.
టీలో మురికి నీళ్లు కలిపి..
నెక్ట్ స్టేషన్ లో రైల్వే సిబ్బంది టీ అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అతడు కల్తీ టీ అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. టీకి ఎక్కువగా డిమాండ్ ఉన్న సమయంలో రైల్వే స్టేషన్ లోని ట్యాప్ నీళ్లను అందులో పోస్తున్నట్లు చెప్పాడు. ఒక్కోసారి రైల్లోనే అందుబాటులో ఉన్న నీళ్లు పోసి అమ్ముతున్నట్లు అధికారులకు వెల్లడించాడు. అంతేకాదు, అతడికి రైల్లో టీ అమ్మేందుకు ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. అందుకే, అతడి టీ తాగిన వాళ్లు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. అక్రమంగా రైళ్లలో టీ అమ్మడమే కాకుండా, కల్తీ చేస్తూ ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యహరించిన సదరు వ్యాపారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గత నెలలో 23 మందిపై కేసులు
ఉత్తర మధ్య రైల్వేలోని ఆగ్రా డివిజన్ లో గత కొంతకాలంగా రైళ్లలో అక్రమ విక్రయాలు పెరిగిపోయాయి. అనధికారిక/బ్రాండెడ్ కాని నీరు, ప్యాక్ చేయని ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకూడదని రైల్వే అధికారులు ప్రయాణీకులకు సూచిస్తున్నారు. గత నెలలో ఏకంగా 23 మంది అక్రమ విక్రేతలను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. తాజాగా అల్వార్-మధుర మధ్య నడిచే ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ లో ముగ్గురు అక్రమ వ్యాపారులను పట్టుకున్నారు. వారిని మధుర జంక్షన్ రైల్వే పోలీసులకు అప్పగించారు.
రైల్వే అధికారుల స్పెషల్ డ్రైవ్
ఇక రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో అక్రమ వ్యాపారులపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు, ఎక్కువ ధరలకు అమ్మడం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లలో సరసమైన ధరలకు నీరు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: రైల్వే TTE కావాలంటే.. ఎంత వరకు చదువుకోవాలి? ఏ ఎగ్జామ్ రాయాలో తెలుసా?