Indian Railways: ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ప్రస్తుతం ప్రధాన రైల్వే స్టేషన్లలో AI టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. AI ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ భద్రతతో పాటు టికెట్ తనిఖీ, బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), న్యూఢిల్లీతో సహా ఏడు ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీని విమానాశ్రయాలలో వాడుతుండగా, ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనూ అమలు చేయబోతున్నారు.
ఇంతకీ ఏంటీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ?
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది ఒక వ్యక్తి ముఖ లక్షణాలను విశ్లేషిస్తుంది. డిజిటల్ ఫోటోలు, వీడియో ఫ్రేమ్ లలో ముఖ నిర్మాణాన్ని స్కాన్ చేస్తుంది. ఇది డేటా బేస్ లో ఉన్న సమాచారంతో సరిపోల్చుతుంది. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ఆధారంగా రూపొందించబడింది. భద్రత, ప్రయాణీకుల అనుభవాన్ని పెంచడానికి భారతీయ రైల్వే ఈ సాంకేతికతను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటున్న నేపథ్యంలో దొంగతనాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర నేరాలు జరిగే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ సాయంతో అనుమానాస్పద వ్యక్తులను, ముఖ్యంగా క్రిమినల్ డేటా బేస్ లో నమోదు చేయబడిన వారిని గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ సాంకేతికత అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడంలో, నేరస్థులను పట్టుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా స్టేషన్లలో భద్రతను పెంచుతుంది.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో లాభం ఏంటి?
ఈ సాంకేతికత నేరస్థులను, వాంటెడ్ వ్యక్తులను, అనుమానితులను వెంటనే గుర్తిస్తుంది. స్టేషన్లలో భద్రతను పెంచుతుంది. టికెట్ తనిఖీ, గుర్తింపు ధృవీకరణలో సమయం ఆదా అవుతుంది. ఇది ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ సాంకేతికత మాన్యువల్ పర్యవేక్షణ కంటే మరింత కచ్చితంగా, వేగంగా ఉంటుంది. ప్రారంభ దశలోనే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం ద్వారా నేరాలను నివారించే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికత ప్రయాణీకుల రద్దీని అర్థం చేసుకుని స్టేషన్ లో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే?
ప్రస్తుతం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని దేశంలోని పలు విమానాశ్రయాలలో ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇతర విమానాశ్రయాలలో డిజి యాత్ర పేరుతో అమలు అవుతుంది. ప్రయాణీకుల గుర్తింపు, బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రయాణీకులు పేపర్ టికెట్లు, ID తనిఖీలు లేకుండా విమానాశ్రయాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఈ టెక్నాలజీని జూలై 2019లో దేశంలోని పలు విమానాశ్రయాలలో ప్రారంభించారు. కంపార్టెక్ 2024 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 40% దేశాలలో FRT కార్యాలయాలలో ఉపయోగించబడుతోంది. ఈ సాంకేతికత 24% దేశాలలో బస్సులలో, 40% దేశాలలో రైళ్లు, మెట్రోలలో అమలు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, సింగపూర్, బ్రెజిల్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాలలో, విమానాశ్రయాలు, పోలీసు నిఘా, ప్రజా రవాణా, ప్రైవేట్ రంగాలలో ఉపయోగిస్తున్నారు.
Read Also: అక్కడి బీచ్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్తే.. ఈ భయానక రోగానికి గురవ్వడం పక్కా!