Summer Special Trains From Charlapalli: సమ్మర్ హాలీడేస్ వస్తున్న వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది వేసవి సెలవులలో వెకేషన్స్ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి మొత్తం 26 రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. తాజాగా ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను పొందుపరుస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు
సమ్మర్ స్పెషల్ రైళ్లు ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి బుధవారం రాత్రి 9:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయల్దేరే స్పెషల్ రైలు (నంబర్ 07230).. రెండో రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 4 నుంచి జూన్ 23 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు(నంబర్ 07229) మరుసటి రోజు ఉదయం 11:40 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
సమ్మర్ స్పెషల్ రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే!
సమ్మర్ స్పెషల్ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగి ప్రయాణీకులను ఎక్కించుకోనున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పడిరిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండగల్, కొడైకెనాల్ రోడ్, మధురై, విరుధునగర్, సత్తూరు, కోవిల్ పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్, నాగర్ కోయిల్ రైల్వే స్టేషన్లలో రెండు వైపులా ఆగనున్నాయి.
26 Summer Weekly Special Trains between Charlapalli – Kanniyakumari #summer #specials #railways @drmsecunderabad pic.twitter.com/bvXpd6viDs
— South Central Railway (@SCRailwayIndia) March 20, 2025
ప్రముఖ ఆలయాలను దర్శించుకునే అవకాశం
ఇక చర్లపల్లి- కన్యాకుమారి సమ్మర్ రైళ్లలో వెళ్లే పర్యాటకులు పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంది. అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. చిదంబరేశ్వరుడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. అటు తంజావూరు, మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకునే ఈ ప్రత్యేక రైలు ఉపయోగపడనుంది. ఇక వేసవి తాపం నుంచి బయటపడేందుకు కొడైకెనాల్, ఊటీ వెళ్లాలనుకునే వాళ్లు కూడా ఈ రైల్లో వెళ్లవచ్చు.
Read Also: ఇక ఆ బెర్త్ లు వారికే.. సీనియర్ సిటిజన్లు, గర్భిణీలకు రైల్వే గుడ్ న్యూస్!
వేసవి సెలవులలో సాధారణంగా చాలా మంది తమ పిల్లలతో కలిసి పలు పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కన్యాకుమారికి వెళ్తుంటారు. సమ్మర్ లో పెద్ద సంఖ్యలో పర్యాటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సరికొత్త గ్లాస్ వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరువళ్లువర్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ ను అనుసంధానిస్తూ ఈ అద్దాల వంతెనను నిర్మించారు. దీని మీద నిలబడి అద్భుతమైన బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్ర సంగమాన్ని , సూర్యోదయాస్తమానాలను చూసే అవకాశం ఉంది.
Read Also: విశాఖ రైళ్లకు సికింద్రాబాద్ లో నో హాల్టింగ్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!