Vishnu Priya:బెట్టింగ్ అనే భూతాన్ని ఇండియా నుండి తరిమికొట్టడానికి మొదటి అడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ఐఏఎస్ వీసీ సజ్జనార్ ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ విచారిస్తున్నట్లు సమాచారం. ఇక రూల్స్ అతిక్రమించిన వారికి జైలు శిక్ష తప్పదు అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ (Vishnu Priya) పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. Taj 777book.com అనే పేరుతో ఉన్న ఒక బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విష్ణు ప్రియ పై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..
ఇక ఈ విషయం పంజాగుట్ట పోలీసుల వరకు చేరడంతో ఈమెపై కేసు ఫైల్ అయ్యింది. ఇక విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు. కానీ మీడియాకు భయపడి విష్ణుప్రియ, టేస్టీ తేజ విచారణకు హాజరు కాలేదనీ .. వీరిద్దరి తరఫున మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్.జే.శేఖర్ భాష పంజాగుట్ట పోలీసులతో మాట్లాడి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. కానీ ఎట్టకేలకు ఈరోజు పోలీసుల ముందు హాజరయ్యారు విష్ణు ప్రియ. విచారణలో భాగంగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం నేరమని తెలియదా? బెట్టింగ్ యాప్ ల మూలంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలుసా..? వీటిని ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఎంతవరకు లబ్ధి చేకూరింది? అనే ప్రశ్నలతో ఆమెను ఇరుకున పెట్టేశారు.
తప్పు ఒప్పుకున్న విష్ణు ప్రియ..
విచారణలో భాగంగానే తన తప్పు ఒప్పుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకుందట. అంతేకాదు మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలు చేసినట్టు, అవన్నీ కూడా ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారానే షేర్ చేసినట్టు తెలిపింది. ఇకపోతే తప్పు ఒప్పుకోవడంతో ఆమె బ్యాంకు స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు,ఆమె మొబైల్ ని కూడా సీజ్ చేశారు. ఏదేమైనా దాదాపు 15 బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తప్పు ఒప్పుకోవడంతో.. మరి ఈమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
విష్ణుప్రియ కెరియర్..
‘పోవే పోరా’ అనే షో ద్వారా ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో కూడా నటించింది. ఇక షోల ద్వారా సినిమాల ద్వారా రాని గుర్తింపు.. బిగ్ బాస్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని ఫైనల్ వరకు చేరుతుందని అందరూ అనుకున్నారు. తోటి కంటెస్టెంట్ పృథ్వీ తో రిలేషన్ కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయిందని అభిమానులు కూడా నిట్టూర్చిన విషయం తెలిసిందే.