Maha Kumbh Train Services: మహా కుంభమేళాకు భారీగా యాత్రికులు తరలి వస్తున్న నేపథ్యంలోనే భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుంభమేళా ప్రారంభం రోజున (జనవరి 14న) 135 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు చెప్పిన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్.. పవిత్ర మౌని అమావాస్య కోసం 360 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు ప్రయాగరాజ్ కు చేరుకుంటాయని తెలిపారు. మహా కుంభమేళా మొత్తంలో ఇవాళే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఒకే రోజు 190 ప్రత్యేక రైళ్లు
ఇవాళ (బుధవారం) మరో 190 ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసినట్లు సతీష్ కుమార్ తెలిపారు. ఈ రైళ్లు NR, NER & NCR జోన్ల నుంచి ప్రయాగరాజ్ కు చేరుకోనున్నాయి. మొత్తంగా ఇవాళ నాలుగు నిమిషాలకు ఓ రైలు నడిచేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లక్షలాది మంది యాత్రికులకు ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 20 కోట్ల మంది పుణ్య స్నానాలు
ఇక ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లోజరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల వరకు 17.5 మిలియన్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. జనవరి 28 వరకు సుమారు 20 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. అటు మహా కుంభమేళాలో పాల్గొనే భక్తులు తగిన సూచనలు పాటించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. “మహా కుంభమేళాలో పాల్గొనే ప్రియమైన భక్తులారా.. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఘాట్ లో పవిత్ర స్నానం చేయండి. త్రివేణి సంగమం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయకండి. సంగమంలోని అన్ని ఘాట్ లలో స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశాం. పుకార్లను పట్టించుకోకండి. అధికారుల సూచనలు పాటించండి. ప్రవిత్ర ఆధ్యాత్మిక వేడుకలో అపశృతి జరగకుండా చూడండి” అంటూ యోగి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు.
ప్రధాని మోడీ ప్రత్యేక పర్యవేక్షణ
అటు బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట గురించి మహా కుంభమేళా ప్రత్యేక కార్యనిర్వాహక అధికారి ఆకాంక్ష రాణా స్పందించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుంభమేళాలో ఎలాంటి తీవ్ర పరిస్థితులు లేవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కుంభమేళా జరుగుతున్న తీరును, నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆకాంక్ష వెల్లడించారు. తొక్కిసలాట నేపథ్యంలో సెక్టార్ నెంబర్ 2లో కొన్ని గంటల పాటు పుణ్య స్నానాలను నిలిపివేసినట్లు తెలిపారు. పరిస్థితి చక్కబడిన తర్వాత యథావిధిగా పుణ్య స్నానాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మౌని అమావాస్య రోజు సంగంమంలో స్నానం ఆచరించేందు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నట్లు తెలిపారు.
Read Also: దేశంలో అత్యంత పురాతన రైల్వే స్టేషన్లు ఇవే.. భారత్ లో ఫస్ట్ స్టేషన్ ను ఎక్కడ నిర్మించారంటే?