Jammu-Srinagar First Train Service: ప్రతిష్టాత్మక జమ్మూ-శ్రీనగర్ రూట్ లో ఇండియన్ రైల్వే కొత్త రైల్వే సర్వీసులను ప్రారంభించబోతున్నది. త్వరలో ఈ రూట్ లో తొలి రైలు పరుగులు తీయబోతున్నది. ఇప్పటికే ట్రయర్ రన్స్ కూడా నిర్వహించారు. అయితే, జమ్మూ-శ్రీనగర్ మధ్య ఇన్ని రోజులు వందేభారత్ రైలు నడుస్తుందని అందరూ భావించారు. కానీ, తాజాగా పర్వత ప్రాంతం కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు రకాల రేక్‌లను ఉత్తర రైల్వేకు అందించారు అధికారులు. ఈ నేపథ్యంలో జమ్మూ-శ్రీనగర్ రూట్ లో వందేభారత్ కాకుండా అత్యాధునిక LHB రేక్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.
అసలు విషయం చెప్పిన ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్
జమ్మూ నుంచి శ్రీనగర్ వందే భారత్ రైలు ప్రతిష్టాత్మక ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్ట్ మీదుగా నడిపించాలని భావించారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (SVDK)- శ్రీ నగర్ మధ్య ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించారు. అయితే, రీసెంట్ గా LHB రేక్ లు కూడా ఉత్తర రైల్వేకు అందడంతో ఏ రైలు మొదట తన సేవలను ప్రారంభిస్తుందో తెలియక ప్రయాణీకులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ అంశంపై ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ వర్మ కీలక ప్రకటన చేశారు. “జమ్మూ నుంచి శ్రీనగర్ కు నడిపే తొలి రైలు వందేభారత్ అవుతుంది. మేము ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసాము” అని చెప్పారు.
జమ్మూ నుండి శ్రీనగర్ వందే భారత్ రైలు
చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసిన జమ్మూ-శ్రీనగర్ వందే భారత్ రైలు ప్రత్యేకంగా యాంటీ-ఫ్రీజింగ్ లక్షణాలతో రూపొందించబడింది. ఇది దేశవ్యాప్తంగా నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు భిన్నంగా ఉంటుంది. ఇది అత్యంత చలి పరిస్థితుల్లో.. అంటే -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రూపొందించారు. ప్రయాణీకులకు, లోకో పైలెట్లకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా అధునాతన తాపన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. డ్రైవర్ క్యాబిన్ ఫాగింగ్, ఫ్రీజింగ్ కాకుండా నిరోధించడానికి హీటెబ్ విండ్ షీల్డ్ ను కలిగి ఉంటుంది. ఇది తీవ్రమైన చలిలోనూ స్పష్టమైన విజుబులిటీని అందిస్తుంది. రైలు ప్లంబింగ్ విషయంలోనూ కీలక జాగ్రత్తలు తీసుకున్నారు. నీరు గడ్డకట్టకుండా నిరోధించడానికి బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. చల్లని వాతావరణంలో అవసరమైన వ్యవస్థలు పని చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ కోసం LHB రేక్ లు
అటు జమ్మూ-కాశ్మీర్ రూట్ లో నడిచేందుకు ఎయిర్ కండిషన్డ్ LHB రేక్ ను రూపొందించారు. కపుర్తాలాకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వీటిని అభివృద్ధి చేసింది. ఈ కొత్త LHB రేక్ కాశ్మీర్ లోయలోని చల్లని వాతావరణాన్ని తట్టుకుని పని చేస్తుంది. ఈ రేక్ లు చూడ్డానికి సాధారణ LHB రేక్‌ల మాదిరిగానే ఉంటుంది. కానీ, స్వింగ్ తలుపులకు బదులుగా తేజస్ రేక్ ల వంటి ఆటోమేటిక్ డోర్లను కలిగి ఉంటాయి. అతి చల్లని వాతావరణంలో నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు నీటి పైపులైన్లలో స్వీయ నియంత్రణ తాపన కేబుల్స్, ఇన్సులేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోచ్ లను వెచ్చగా ఉంచడానికి అధిక సామర్థ్యంతో కూడిన AC యూనిట్ ను ఏర్పాటు చేశారు.
Read Also: 57 రైళ్లకు హాల్టింగ్, తెలుగు ప్రయాణీకులు రైల్వే గుడ్ న్యూస్, ఏ ఏ స్టేషన్లలో ఆగుతాయో తెలుసా?