CM Revanth Reddy: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు సహజం. సరైన సమయంలో అడుగులు వేసినవాళ్లే కింగ్ అవుతారు.. తేడా వస్తే పార్టీలకు కష్టకాలం తప్పదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీలకు కత్తిమీద సాముగా మారినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో మాట ఇచ్చిన ప్రకారమే ముందుకెళ్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ.
అందరూ అనుకున్నట్లుగానే రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ లకు చిత్త శుద్ది ఉంటే ఆ పార్టీలు సభలో మాట ఇవ్వాలని సవాల్ విసిరారు.
చట్టపరంగా చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. సమగ్ర కులగణన సర్వే నివేదికపై మంగళవారం శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సర్వేలో చాలామంది బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులు వివరాలు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడైనా ఆయా నేతలు సర్వేలో పాల్గొని వివరాలు ఇవ్వాలన్నారు.
సర్వేలో చాలామంది బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులు వివరాలు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 శాతం సీట్లను బీసీలకు ఇవ్వనుంది. మరి బీఆర్ఎస్, బీజేపీలు ఇస్తాయా అంటే కష్టమేనన్నది కొందరు నేతల మాట.
ALSO READ: కెమికల్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. కుప్పకూలిన భవనం.. అదుపులోకి రాని మంటలు..
ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీలు బీసీల విషయంలో ఇరకాటంలో పడ్డారనే చెప్పవచ్చు. ఇదే క్రమంలో కీలక పాయింట్లను ప్రస్తావించారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51 శాతమని, కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే ప్రకారం 56 శాతం పైమాటేనని అన్నారు.
2014 సర్వే రిపోర్టును కేవలం ఒక కుటుంబం మాత్రమే దాచిపెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రతీ పదేళ్లకు జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం సేకరించేవారని, గడిచిన నాలుగేళ్ల నుంచి ఇప్పటివరకు మోదీ సర్కార్ ఎలాంటి అడుగు ముందుకేయలేదన్నారు. కులగణన చేయాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేసినప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి కదలిక లేదని చెప్పకనే చెప్పారు.
ఇక తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు కేంద్రానికి ఆ తీర్మానాన్ని పంపాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ స్థితిగతుల పేరిట సర్వే నిర్వహించిందని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.
అసెంబ్లీలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందంటే కచ్చితంగా నిలబెట్టుకుంటుంది. ఈ విషయంలో ఎవరేం చెప్పినా రేవంత్ సర్కార్ ఆ విధంగానే ముందుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ దారిలో ఈ రెండు పార్టీలు నడుస్తాయా? బీసీల విషయంలో రాజ్యాంగ ప్రకారమే తాము ఫాలో అవుతామని చెప్పి తప్పుకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్‌కు ఈ రెండు పార్టీలు విలవిలలాడుతున్నాయి.