Tollywood: గత ఏడాదికాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు అటు సినీ సెలబ్రిటీలను, ఇటు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు వరుస సినిమాలలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, అందచందాలతో యువతను ఉర్రూతలూగించిన ఎంతోమంది నటీనటులు స్వర్గస్తులవడం అందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో కొంతమంది అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులయితే, ఇంకొంతమంది వృద్ధాప్య రీత్యా మరి కొంతమంది మరణిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సీనియర్ నటి పుష్పలత (Pushpa Latha) (87)చెన్నైలో కన్నుమూశారు.
సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
చెన్నైలోని టీ. నగర్ లో ఉన్న తిరుమల పిళ్ళై రోడ్డులో నివాసం ఉంటున్న ఈమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈమె మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె ఎన్నో చిత్రాలలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. తమిళనాడు కోయంబత్తూర్ లోని మేటు పాలయానికి చెందిన ఈమె.. 9వ ఏటనే భరతనాట్యంలో శిక్షణ పొందారు.
పుష్పలత కెరియర్..
1995 లో ఎస్సే నటరాజు దర్శకత్వం వహించి, నిర్మించిన ‘నల్లతంగై’ అనే తమిళ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 1962లో వచ్చిన ‘కొంగు నాట్టు తంగం’ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె, ఆ తర్వాత హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలుపుకొని సుమారు 100కు పైగా చిత్రాలలో నటించింది. ఇక ఈమె నటించిన తమిళ సినిమాల విషయానికొస్తే పార్ మగళే పార్, శారద, కర్పూరం, దర్శనం, జీవనాంశం, నానుమ్ ఒరు పెన్, సంతానం , సిమ్లా స్పెషల్ వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరును అందించాయి. ఈమె ఎం ఏ రాజా (MA.Raja), శివాజీ గణేషన్(Shivaji Ganeshan), ఎంజీఆర్ (MGR)వంటి దిగ్గజ నటులతో కలిసి నటించింది .
పుష్పలత నటించిన తెలుగు చిత్రాలు..
ఎన్టీఆర్ (NTR) హీరోగా కోవెలమూడి భాస్కరరావు రూపొందించిన ‘చెడపకురా చెడేవు’ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆడబిడ్డ, ఘరానా దొంగ, మా ఊరిలో మహాశివుడు, రక్త బంధం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, శూలం, మూగవాని పగ, ఉక్కు మనిషి, విక్రం , రంగూన్ రౌడీ వంటి వాళ్ళ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
పుష్పలత వ్యక్తిగత జీవితం.
నానుమ్ ఒరు పెన్ సినిమా చిత్రంలో నటిస్తున్నప్పుడే.. ఈ సినిమాలో తనకు జోడిగా నటించిన ఏవీఎం రాజన్ (AVN (Rajan) తో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 1964లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో ఒక అమ్మాయి మహాలక్ష్మి(Mahalakshmi) ఆమె తెలుగు, తమిళ్ చిత్రాలలో కూడా నటించారు.