Indian Railways: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకంగా వెళ్లే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. భారతీయ రైల్వే సైతం ప్రయాణీకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జర్నీ చేసేలా, తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్లాట్ ఫారమ్ టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణం కోసం కాకుండా, కేవలం స్టేషన్ లోపలికి మాత్రమే వెళ్లడానికి ఈ టికెట్ ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ టికెట్ ను ఎందుకు పెట్టారు? ఈ టికెట్ ద్వారా ప్రయాణీకులకు కలిగే లాభం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్లాట్ ఫారమ్ టికెట్ ఉద్దేశం ఏంటి?
సాధారణంగా నిత్యం రైల్వే స్టేషన్ కు పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వస్తుంటారు. వారిని రైలు ఎక్కించడానికి లేదంటే రైళ్లో వచ్చే వారిని తీసుకెళ్లేందుకు కుటంబ సభ్యులు, బంధులు, మిత్రులు రైల్వే స్టేషన్ కు వస్తుంటారు. ప్రయాణీకులు కాకుండా స్టేషన్ లోకి వెళ్లడానికి ఈ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
⦿ రద్దీ నియంత్రణ: ప్లాట్ ఫారమ్ టికెట్ ప్రధాన ఉద్దేశాలలో ఒకటి రద్దీని నియంత్రించడం. స్టేషన్ లోపలికి వెళ్లే వారి సంఖ్యను కంట్రోల్ చేయడానికి, రద్దీని తగ్గించడానికి ప్లాట్ ఫారమ్ టికెట్ ఉపయోగపడుతుంది. టికెట్ ఉంటేనే లోపలికి వెళ్లాలననే నిబంధన ఉన్న నేపథ్యంలో చాలా మంది తమ బంధువులను స్టేషన్ బయటే డ్రాప్ చేసి వెళ్తారు. అలా చేయడం వల్ల ప్లాట్ ఫారమ్ మీద రద్దీ కంట్రోల్ అవుతుంది. ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలగదు.
⦿ భద్రత: స్టేషన్ లోకి ఇతరుల అనవసర ప్రవేశాన్ని నివారిస్తుంది. ఈ కారణంగా భద్రత పెరుగుతుంది. ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
⦿ ప్రయాణీకులకు కలిగే ప్రయోజనం: ప్లాట్ ఫారమ్ టికెట్ ద్వారా, ప్రయాణీకులు తమ బంధువులు లేదంటే స్నేహితులను స్టేషన్ లోపల ప్లాట్ ఫారమ్ మీద కలుసుకోవచ్చు. తమ లగేజీని రైల్లోకి ఎక్కించడంతో పాటు రైల్లో నుంచి దింపే అవకాశం ఉంటుంది.
ప్లాట్ ఫారమ్ టికెట్ ధర ఎలా ఉంటుంది?
వాస్తవానికి ప్లాట్ ఫారమ్ టికెట్ ధరలు ప్రాంతం, స్టేషన్ ఆధారంగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు పండుగ సీజన్లలో లేదంటే రద్దీ సమయాల్లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా స్టేషన్లలో ప్రస్తుతం ప్లాట్ ఫారమ్ టికెట్ ధర రూ. 10గా ఉంటుంది.
ఫ్లాట్ ఫారమ్ టికెట్ లేకుండా స్టేషన్ లోపలికి వెళ్తే?
నిజానికి ప్లాట్ ఫారమ్ టికెట్ లేకుండా స్టేషన్ లోపలికి వెళ్లడం చట్టవిరుద్ధం. ఒకవేళ అధికారుల చెకింగ్ లో పట్టుబడితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే, సురక్షితంగా తమ బంధు, మిత్రులను రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లే సమయంలో కచ్చితంగా ప్లాట్ ఫారమ్ టికెట్ కొనుగోలు చేయడం మంచిది. లేదంటే అనసవరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Read Also: చర్లపల్లి- శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే?