Bullet Train Earthquake Detection System: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఇండియన్ బుల్లెట్ రైలు 2027 ఆగష్టు 15న పట్టాలెక్కబోతోంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ లో ఈ రైలు పరుగులు తీయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే ముందస్తు భూకంప గుర్తింపు వ్యవస్థను ఈ రైల్లో ఇన్ స్టాల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారిడార్ లో సివిల్ నిర్మాణ పనులతో పాటు ఎలక్ట్రిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. భారత్ లో తొలిసారిగా జపాన్‌కు చెందిన షింకన్సెన్ హైస్పీడ్ రైలు సాంకేతికతను ఈ ప్రాజెక్ట్ లో ఉపయోగిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ప్రత్యేకమైన అంశం భూకంప గుర్తింపు సీస్మోమీటర్ల ఏర్పాటు. కారిడార్ మొత్తం మీద ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. భూకంపం సంభవించే సూచనలు కనిపించిన వెంటనే ఈ వ్యవస్థ రైలుకు హెచ్చరికలను పంపుతుంది. దీంతో రైళ్లను అత్యవసరంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లలో ప్రయాణికుల భద్రతను మరింత పెంచేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ కారిడార్ లో మొత్తం 28 సీస్మోమీటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 16 గుజరాత్ లో, మరో 12 మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తారు. కారిడార్ వెంట ఉన్న 14 ట్రాక్షన్ సబ్ స్టేషన్లలో ఈ వ్యవస్థ పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భూకంపం వచ్చిన కొన్ని క్షణాల్లోనే రక్షణ చర్యలు ప్రారంభమయ్యేలా ఈ టెక్నాలజీ రూపొందించబడింది.
ఇది మాత్రమే కాకుండా బుల్లెట్ రైలు కారిడార్‌లో అత్యాధునిక ఓవర్‌హెడ్ ట్రాక్షన్ విద్యుత్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో హైస్పీడ్ రైళ్ల కోసం ఉపయోగిస్తున్న ఈ సాంకేతికతను భారతదేశంలో తొలిసారిగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా రైలుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందుతుంది. గంటకు 320 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు ఈ వ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించారు. నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ ముందుగా స్పెషల్ గ్రిడ్ సబ్ స్టేషన్లకు చేరుతుంది. అక్కడి నుంచి కారిడార్ వెంబడి ఏర్పాటు చేసిన 14 ట్రాక్షన్ సబ్ స్టేషన్ల ద్వారా రైలుకు విద్యుత్ సరఫరా జరుగుతుంది.
ఈ విధానం వల్ల ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు రైలు ప్రయాణించే సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. అంతేకాకుండా స్టేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, నిర్వహణ కేంద్రాలకు కూడా ఇదే వ్యవస్థ ద్వారా విద్యుత్ అందుతుంది. దీంతో మొత్తం హైస్పీడ్ రైలు నెట్ వర్క్ సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భారత్ లో హైస్పీడ్ రైలు ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
Read Also: ఏసీ కోచ్‌లో రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అసలు కారణం ఇదే!