దేశ వ్యాప్తంగా 7,300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పలు ప్రత్యేకతలు కలిగి రైల్వే స్టేషన్లు చాలా ఉన్నాయి. దేశంలో కొన్ని అత్యంత పెద్ద రైల్వే స్టేషన్లు ఉండగా, మరికొన్ని అతి చిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కొన్ని చిత్రమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లు అత్యంత భద్రతతో కూడి ఉన్నాయి. మరికొన్ని రైల్వే స్టేషన్ల ద్వారా నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు మనం దేశంలో ఉన్న ఓ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం..
దేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్నది. దీని పేరు ఘుమ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో ఉంది. ఇది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పరిధిలోకి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి ఏకంగా 2,258 మీటర్లు, అంటే.. 7,407 అడుగుల ఎత్తులో ఉంది.
1878లో నిర్మించిన బ్రిటిషర్లు
దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘుమ్ రైల్వే స్టేషన్ ను బ్రిటిషర్లు నిర్మించారు. 1878లో ఈ రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైల్వే స్టేషన్ ఏకంగా 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కోల్ కతాను డార్జిలింగ్ తో కనెక్ట్ చేయడానికి బ్రిటిష్ వాళ్లు ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. 1879లో ఈ రైల్వే లైన్ ను ఘుమ్ వరకు విస్తరించారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంతానికి ప్రయాణం మరింత ఈజీగా మారింది.
ప్రపంచంలోనే అత్యంత అందమైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు
డార్జిలింగ్ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘుమ్ రైల్వే స్టేషన్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోని 14వ అత్యంత అందమైన స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ అత్యంత ఎత్తులో ఉండటంతో సందర్శకులు మేఘాల మీద తేలుతున్నట్లు ఫీలవుతారు. దేశ వ్యాప్తంగా పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణగా మిగిలింది ఈ రైల్వే స్టేషన్.
డార్జిలింగ్ నుంచి ఘుమ్ వరకు టాయ్ ట్రైన్ జర్నీ
అటు డార్జిలింగ్ నుంచి ఘుమ్ స్టేషన్ వరకు టాయ్ రైలు నడుస్తున్నది. ఈ ప్రయాణ సమయంలో పర్యాటకులకు అద్భుతమైన డార్జిలింగ్ అందాలను తిలకించే అవకాశం ఉంటుంది. దేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్ అయిన ఘుమ్ స్టేషన్ సందర్శన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: హైదరాబాద్ నుంచి ఆ నగరాలకు హైస్పీడ్ రైల్.. జస్ట్ 2 గంటల్లోనే గమ్యానికి!
200 ఏండ్ల రైల్వే మ్యూజియం
ఘుమ్ లో 200 సంవత్సరాల భారతీయ రైల్వేకు సంబంధించిన ప్రత్యేకతలు చాటి చెప్పే రైల్వే మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో 1883 నాటి రైల్వే టిక్కెట్లు కూడా కనిపిస్తాయి. ఘుమ్ రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణాన్ని వివరించే ఫోటోలను కూడా ఇందులో భద్రపరిచారు.
Read Also: ఆ రూట్‌లో వందే భారత్ రైలు బోగీల తగ్గింపు.. ఈ తేదీ నుంచే అమలు!