ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. జనవరి 12న ప్రారంభమైన ఈ వేడుక 45 రోజుల పాటు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కోసం దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మూడు నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. 5 రోజుల్లోనే 8 కోట్ల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. వీరి కోసం ఏకంగా 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయల్దేరనున్నట్లు వెల్లడించింది.
సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు యాత్రా స్పెషల్
కుభమేళా నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ తాజాగా సికింద్రాబాద్ నుంచి యాత్రా స్పెషల్ రైలును ప్రకటించింది. 8 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రకు సంబంధించి స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మళ్లీ 22న హైదరాబాద్ కు చేరుకోనుంది. వారం రోజుల పాటు మహాకుంభ మేళాతో పాటు పలు ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల మీదుగా ప్రయాణించనుంది. యాత్రికులు వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ ను దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 578 మంది యాత్రికులు ప్రయాణించేలా ఈ ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
ఏ రోజు ఎక్కడికి వెళ్తుందంటే?
ఈ రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి 18న యూపీలోని ప్రయాగరాజ్ కు చేరుకుంటుంది. అక్కడ దిగి యాత్రికులంతా మహా కుంభమేళాలో పాల్గొంటారు. ఆ తర్వాత 19న వారణాసికి వెళ్తారు. అక్కడ కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 20న అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని దర్శించుకుంటారు. అనంతరం ఈ రైలు తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ నెల 22న ఈ రైలు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఇక ఈ రైలు యాత్రికులు ఎక్కేందుకు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసూర్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: ఈ కొత్త రూల్ తెలుసా? అది ఇక చిత్తు కాగితమే.. స్పాట్‌లోనే గెంటేస్తారు జాగ్రత్త!
ప్యాకేజీ ధరల వివరాలు
ఇక ఈ యాత్ర ప్యాకేజీలో ఎకానమీలో పెద్దలకు రూ.23,035, పిల్లలకు రూ.22,140గా చార్జీ ఫిక్స్ చేశారు. ఏసీ కోచ్ లలో ఛార్జీలు వేరుగా ఉంటాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాకు వెళ్తున్న నేపథ్యంలో ఈ యాత్రా రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
Read Also: వందేభారత్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు, వీటిలో మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి!