Indian Railways: రైల్వే టికెట్ల బుకింగ్ సమయంలో వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తత్కాల్ టికెట్స్ బుకింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అయితే, గత కొంతకాలంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో IRCTC పోర్టల్ పని చేయడం లేదు. లేదంటే, హ్యాంగ్ అవుతోంది. ఒక్కసారి సైట్ హ్యాంగ్ అయిన తర్వాత సుమారు 5 నిమిషాలకు మళ్లీ లోడ్ అవుతోంది. అప్పటికి టికెట్లు అందుబాటులో ఉండటం లేదని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్ ఏజెంట్లు మాత్రం అధి -డిమాండ్ ఉన్న రూట్లలో కూడా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో ఏదో మతలబు ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నాన్ ఏసీ క్లాసులకే సమస్య!
తత్కాల్ బుకింగ్స్ AC క్లాస్ లకు ఉదయం 10 గంటలకు, నాన్-AC క్లాస్ (స్లీపర్, సెకండ్ సిట్టింగ్)కు 11 గంటలకు ఓపెన్ అవుతాయి. తత్కాల్ బుకింగ్స్ సమయంలో ఏర్పడే ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు IRCTC తన సర్వర్ ను గతంలోనే అప్ డేట్ చేసింది. ఇటీవలి కాలంలో తరచుగా సర్వర్ సమస్య తలెత్తుతోంది. IRCTC రైల్ కనెక్ట్ యాప్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుంన్నది. ఈ విషయంపై IRCTC అధికారులు స్పందించారు. గత కొద్ది కాలంగా తత్కాల్ టికెట్స్ బుకింగ్ సమయంలో సైట్, యాప్ హ్యాంగ్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా దీపావళి, ఛత్ పూజ సమయంలో అధిక బుకింగ్‌ల కారణంగా ఈ సమస్య తలెత్తిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందం పని చేస్తున్నట్లు తెలిపారు.
కావాలని సైట్ ను హ్యాంగ్ చేస్తున్నారా?
IRCTC పోర్టల్ నాన్ ఏసీ క్లాస్ లకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాక 80 శాతానికి పైగా తత్కాల్ టికెట్స్ ఉండగానే సైట్, యాప్ హ్యాంగ్ అవుతున్నట్లు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఏసీ తత్కాల్ బుకింగ్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైనా పోర్టల్ ఎప్పుడూ క్రాష్ కాలేదంటున్నారు. నాన్ ఏసీ వరకు వచ్చే సరికి ఈ ఇబ్బంది ఎదురవుతుందంటున్నారు. “హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ నేను చెన్నై నుంచి జైపూర్‌కి టిక్కెట్లను బుక్ చేయలేకపోయాను. కానీ, ఒక ట్రావెల్ ఏజెంట్ వాటిని బుక్ చేశాడు. నేను వెబ్ సైట్‌లో ‘బుక్ నౌ’ క్లిక్ చేసిన క్షణంలో సిస్టమ్ హ్యాంగ్ అయ్యింది. ఎంత సేపటికీ లోడ్ కాలేదు. రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర కూడా సిబ్బంది తరచుగా సిస్టమ్ సమస్యలను ఎదుర్కొంటారు” అని మన్నాడి నివాసి ఎస్ రాంచంద్ తెలిపారు. ఈ వెబ్ సైట్ హ్యాంగ్ వెనుక పెద్ద కుట్రేదో ఉందని ఆయన ఆరోపించారు.
ఇక రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం, ఒక ప్రయాణీకుడు యూజర్ ఐడీతో ఆధార్ లింక్ చేసి ఉంటే IRCTC వెబ్ సైట్, యాప్‌లో ఒక నెలలో 24 రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్ ఐడిని ఆధార్‌తో లింక్ చేయకపోతే 12 టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Read Also: నీటి అడుగున వెళ్లే రైలు, అండర్ వాటర్ లో అద్భుతం గురించి మీకు తెలుసా?