CM Revanth Reddy: హిందూ- ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారు. మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామన్నారు.
సోమవారం రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ- మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, దేశంలో ఉన్నవి రెండే పరివార్ ఉన్నాయని, ఒకటి మోదీ పరివార్ కాగా, రెండోది గాంధీ పరివార్ అని చెప్పుకొచ్చారు.
ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పని చేస్తోందన్నారు ముఖ్యమంత్రి. దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోందని మనసులోని మాట బయటపెట్టారు. దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశంలో మైనారిటీలు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు సీఎం. మోదీ పరివార్‌తో ఉండాలో, గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు.
ALSO READ: హైదరాబాద్ ఓయో హోటల్.. మిడ్‌నైట్ ప్రేయసితో గొడవ, ఆపై
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు తమవంతు కృషి చేయాలన్నారు. కేవలం కాంగ్రెస్‌తో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పకనే చెప్పారు. దేశంలో మోదీని ఓడించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దన్నారు.
ముస్లింలను తాము ఓటర్లుగా చూడటంలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామన్నారు సీఎం రేవంత్. మన ప్రభుత్వంలో సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించామన్నారు. వైఎస్ఆర్ తర్వాత ఇప్పటి వరకు సీఎంఓలో మైనారిటీ అధికారిని నియమించిన దాఖలాలు లేవన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా చేశామని, అమీర్ అలీఖాన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చామన్నారు.