Indian Railways: భారతీయ రైల్వే సంస్థ నష్టాలను తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇకపై రైళ్లు ఆలస్యమైనా రీఫండ్ చెల్లించబోమని వెల్లడించింది. సమాచార హక్కు చట్టం(RTI) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే సంస్థ సమాధానం చెప్పింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆలస్యంగా నడిచే రైళ్లకు రీఫండ్ అందించే సదుపాయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో రైలు ఆలస్యమైన సందర్భంలో ప్రయాణీకులు ఇకపై వారి టిక్కెట్ ఛార్జీలపై రీఫండ్ ను క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు.
ఫిబ్రవరి 15 నుంచి అమలు
రైల్వే సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఫిబ్రవరి 15 నుంచి అమలు అవుతోంది. IRCTC నిర్వహించే ప్రైవేట్ రైళ్లలో మాత్రమే ఈ నిబంధన అమలు కానున్నట్లు తెలిపింది. భారతీయ రైల్వే సంస్థకు చెందిన IRCTC క్యాటరింగ్, టూరిజం, టికెట్ బుకింగ్ తో పాటు ప్రైవేట్ రైళ్లను నిర్వహిస్తున్నది. ప్రత్యేకంగా న్యూఢిల్లీ నుండి లక్నో, అహ్మదాబాద్ నుండి ముంబై వరకు తేజస్ ప్రైవేట్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు ఆలస్యం నడవడం మూలంగా రైల్వే సంస్థ పెద్ద మొత్తంలో రీఫండ్ అందించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రీఫండ్ చెల్లించకూడదనే నిర్ణయానికి వచ్చింది.
కారణాలను వెల్లడించిన IRCTC
RTI ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో, గోప్యత కారణంగా ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వెల్లడించడానికి IRCTC నిరాకరించింది. అయితే, రెండు తేజస్ రైళ్లకు ప్రయాణికులను ఆకర్షించడానికి తొలుత ఆలస్యం అయితే రీఫండ్ చెల్లించే విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ద్వారా మంచి ఆదరణ దక్కే అవకాశం ఉందని ఆలోచింది. ఈ ప్రైవేట్ తేజస్ రైళ్లు న్యూఢిల్లీ నుంచి లక్నో వరకు అక్టోబర్ 4, 2019 నుంచి నడిపిస్తున్నది. మరొకటి అహ్మదాబాద్ నుంచి ముంబైకి జనవరి 17, 2020 నుండి నడిపిస్తున్నది. అయితే.. ఈ రైళ్ల ఆలస్యం కారణంగా IRCTC 2019-20లో రూ. 1.78 లక్షలు, 2021-22లో రూ. 96,000, 2022-23లో రూ. 7.74 లక్షలు, 2023-24లో రూ. 15.65 లక్షల రీఫండ్ ఇవ్వాల్సి వచ్చింది. 60-120 నిమిషాల ఆలస్యానికి ప్రయాణీకుడికి రూ.100 పరిహారం, 120-240 నిమిషాల ఆలస్యానికి ప్రతి ప్రయాణీకుడికి రూ.250 పరిహారం అందించినట్లు IRCTC తెలిపింది. రైలు రద్దు చేసిన సందర్భాల్లో పూర్తి స్థాయి ఛార్జీలను రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు, ఆలస్యం కారణంగా ప్రయాణీకులకు ఆహారం, వాటర్ స్పెసిలిటీ కల్పించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రైళ్ల నుంచి ఎదురయ్యే నష్టాన్ని నివారించుకునేందుకు గాను భారతీయ రైల్వే సంస్థ ఇకపై ఆలస్యం అయినా, రీఫండ్ ఇవ్వబోమని వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా కొంతమేర డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని IRCTC భావిస్తున్నది.
ప్రయాణీకులు మాత్రం అసంతృప్తి
అటు ఈ నిర్ణయం పట్ల ప్రయాణీకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం అయినా, రీఫండ్ ఇవ్వకపోవడం నిజంగా ప్రయాణీకులను మోసం చేయడమే అవుతుందని విమర్శిస్తున్నారు.