అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం చెలరేగిపోయిన వైసీపీ నేతల్లో పలువురు ప్రస్తుతం లైమ్‌లైట్‌లో కనిపించడం లేదు. కేసుల భయంతో ఎవరికి వారు సైలెంట్ అయి అడ్రస్ లేకుండా పోయారు. గత అయిదేళ్లలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, సోషల్ మీడియా దాడులకు సంబంధించి విచారణలు జరిపిస్తున్న కూటమి ప్రభుత్వం అలాంటి వారిపై సమర్ధంగా చర్యలు తీసుకోలేకపోతుందన్న అపవాదు మూటగట్టుకుంటుంది. ఆ క్రమంలో వైసీపీ నేతలు పోలీసులకు, యంత్రాంగానికి బహిరంగ వార్నింగులు ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఏమీ చేయలేదన్న అలుసుతోనే వారు పెట్రేగిపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది
అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చు అన్నట్లు వ్యవహరించింది గత వైసీపీ ప్రభుత్వం. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలనను ప్రారంభించిన జగన్.. ఆ తరువాత కూడా తనకు ఎదురులేదన్నట్లు వ్యవహరించారు. ఆ పార్టీ నాయకులు కూడా ఆయన్నే ఫాలో అయ్యారు. టీడీపీ నేతలపై దాడులు, హత్యలు, పార్టీ కార్యాలయాలపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం చెలరేగిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టి నానా హంగామా చేశారు.
ఎల్లకాలం తామే అధికారంలో ఉంటామన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, కార్యకర్తల పాపం అయిదేళ్లకే పండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా సైకోల భరతం పడుతుంది. ఎవరెవరు సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల పెట్టారో వారందరినీ ఉతికి ఆరేసే పనిలో పడింది సర్కార్. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై విచారణలు కొనసాగుతున్నాయి. ఆ ఎఫెక్ట్‌తో అప్పట్లో బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు ఎక్కడున్నారో తెలియకుండా పోయారు. వారిపై ఎన్ని కేసులున్నా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులు అయిన మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు, సతీమణి జయసుధ పరారయ్యారు. పోలీసుల నోటీసులు ఇచ్చినా పేర్ని నాని, కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పేర్ని ఫ్యామిలీ జిల్లా పోలీసు అధికారుల సహకారంతోనే దాగుడుమూతలు అడుతుందన్న ఆరోపణలున్నాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, సజ్జల భార్గవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ వంటి నేతలపై తీవ్ర అభియోగాలున్నా చర్యల విషయంలో తాత్సారం జరుగుతూనే ఉండటం కూటమి శ్రేణులకు మింగుడు పడటం లేదంట. కక్ష సాధింపు చర్యలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పదేపదే చెప్తున్నారు. సరే… మరి చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా అంటున్నారు కదా… ఎప్పుడా పని మొదలుపెట్టేదని అధికారపక్షాల కేడర్ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వపెద్దల ఉదాసీన వైఖరి వైసీపీ నాయకులకు అలుసిచ్చి, మరింత చెలరేగిపోయేలా చేస్తుందని ఎత్తిచూపిస్తున్నారు.
దానికి తగ్గట్టే కూటమి ప్రభుత్వానికి వైసీపీ కోఆర్డినేటర్, గత ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ శ్రేణులపై ఆక్రమ కేసులు పెట్టడం ఆపకపోతే… తాము అధికారంలో కొచ్చాక కొట్టే దెబ్బ చాలాగట్టిగా ఉంటుందని సజ్జల హెచ్చరించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శకు వచ్చిన సజ్జల సర్కారుకి సినిమా స్టైల్లో వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారిందిప్పుడు.
ఓటమి తర్వాత ఎక్కడుంటున్నారో తెలియకుండా పోయిన నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఇటీవల వాయిస్ పెంచుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు రోజా. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ఆ ఫ్లోలో కూటమి నేతలకు మాజీ మంత్రి రోజా గట్టి వార్నింగ్ ఇచ్చారు. క్రీడా, టూరిజం శాఖల నిధుల దుర్వినియోగానికి సంబంధించి రోజాపై తీవ్ర ఆరోపణలున్నాయి. నగరిలో ఆమె కుటుంబసభ్యుల దోపిడీపై టీడీపీ శ్రేణులు వరుస ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆ కేసుల భయంతో ప్రజలకు కనిపించకుండా పోయిన రోజా… వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరిస్తున్నారు తర్వాత వచ్చేది వారి ప్రభుత్వమేనంట అప్పుడు తామేంటో చూపిస్తారంట.
ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పార్టీతో పాటు తాను పరాజయం పాలైనాకూడా దౌర్జన్యకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ మహిళపై అత్యాచారం కేసులో తన ముఖ్య అనుచురుడిపై కేసు పెట్టారంటూ కాకాణి తాజాగా బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. ఏకంగా పోలీసు, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: బడ్జెట్‌లో ఏపీకి పంట, రాజకీయాలపై కూడా.. పీఎంతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓడిపోయిన మూడో నెల నుంచే ఈ బెదిరింపుల పల్లవి ఎత్తుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా ప్రభుత్వానికి, యంత్రాంగానికి వార్నింగులు ఇచ్చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల టైం ఉంది. అప్పుడే అధికారంపై కలలు కనేస్తున్న వైసీపీ నేతల వైఖరి చూస్తూ .. ఇదంతా ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న అలుసే అని కూటమి శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీద చిందులేసిదంటారు ఇదేనేమో?