Ixigo New Feature: రైల్వే ప్రయాణీకులు సాధారణంగా టికెట్లను IRCTC వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకుంటారు. భారతీయ రైల్వే సంస్థ అధికారిక వెబ్ సైట్ కావడంతో చాలా మంది సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుందని భావిస్తారు. IRCTCతో పాటు పలు ప్రైవేట్ ట్రావెలింగ్ టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ఈ యాప్స్ వినియోగదారులను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫారమ్ ఇక్సిగో(Ixigo).
‘ట్రావెల్ గ్యారెంటీ’ ఫీచర్ ను పరిచయం చేసిన ఇక్సిగో
‘ట్రావెల్ గ్యారెంటీ’ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది ఇక్సిగో. ఈ ఫీచర్ ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లు కూడా కచ్చితంగా కన్ఫర్మ్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఫీచర్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు కచ్చితంగా కన్ఫర్మ్ అవుతాయి. ఒకవేళ టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే వినియోగదారులకు మూడు రెట్లు డబ్బులు వెనక్కి ఇస్తాంటూ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని ఇక్సిగో సంస్థ వెల్లడించింది.
నామమాత్రపు ఛార్జీతో కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం
ఎంపిక చేసిన రైళ్లలో ‘ట్రావెల్ గ్యారెంటీ’ ఫీచర్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఇక్సిగో వెల్లడించింది. ఆయా క్లాసుల టికెట్ల బుకింగ్ ఛార్జీతో పాటు ఈ ఫీచర్ ను ఉపయోగించుకునేందుకు నామమాత్రపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని ఇక్సిగో వెల్లడించింది. చార్ట్ ప్రిపరేషన్ సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లు కూడా ఈ ఫీచర్ ద్వారా కన్ఫర్మ్ అవుతాయని ప్రకటించింది.
టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బు వాపస్
‘ట్రావెల్ గ్యారెంటీ’ ఫీచర్ రోల్ అవుట్ గురించి ఇక్సిగో ట్రైన్స్ సీఈవో దినేష్ కుమార్ కోథా కీలక విషయాలు వెల్లడించారు. “ఇక్సిగో ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కొత్త సొల్యూషన్స్ తీసుకొస్తున్నాం. ప్రయాణీకులు టికెట బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టు అనేది చిరాకు కలిగిస్తుంది. ఒక్కోసారి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పీక్ ట్రావెల్ సీజన్లలో సీటును బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే మేం’ట్రావెల్ గ్యారెంటీ’ ఫీచర్‌ని తీసుకొచ్చాం. ఈ ఫీచర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నా టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు చెల్లిస్తాం” అన్నారు.
Ixigo యాప్ గురించి..
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్ లలో ixigo ఒకటిగా కొనసాగుతోంది. దీని ద్వారా ట్రైన్ టికెట్లను త్వరగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది IRCTCతో లింక్ అప్ అయి పని చేస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లేలో ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లను కలిగి ఉంది. ఇందులో రైలు టికెట్ బుకింగ్స్ తో పాటు విమానాలు, బస్సులు, హోటళ్ల టికెట్లను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ట్రైన్ టికెట్లు ఈజీగా బుక్ చేసుకునే బెస్ట్ యాప్స్ ఇవే, మీరూ ట్రై చేయండి!