AP Govt: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. ఆ కల నెరవేర్చుకొనేందుకు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. డబ్బు ఉన్నా కూడా వాటి అనుమతులు రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గృహాలు నిర్మించుకొనే వారికి చెప్పులరిగేలా తిరిగే తిప్పలు ఇక లేవని చెప్పవచ్చు.
ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పాలనా పరమైన అంశాలపై దృష్టి సారించింది. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు తగు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రహదారుల అభివృద్దికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, ఎక్కడికక్కడ మరమ్మతులను పూర్తి చేసింది. దీనితో వాహనదారుల ఇక్కట్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా గృహాలు నిర్మించుకొనే వారు ఎదుర్కొనే సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇసుకను ఉచితంగా ఎద్దులబండి, ట్రాక్టర్ల సాయంతో ఉచితంగా తీసుకు వెళ్లవచ్చన్న ఆదేశాలను సైతం ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
దీనితో గృహాలు నిర్మించుకొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణాలు, నగరాల్లో రెండు సెంట్లలోపు అంటే 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ మంజూరు కోసం ఇకపై మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
అలాగే వీరికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపును కూడా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. దీనితో అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎంచక్కా గృహాన్ని నిర్మించుకోవచ్చన్న మాట. అంతేకాదు 300 గజాల లోపు ఇల్లు నిర్మించుకొనే వారికి కూడా అనుమతులు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.
Also Read: AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి
ఈ నిర్ణయంతో పేదలు అనుమతుల కోసం డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు 100 గజాల స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారా.. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండ, ఏ కార్యాలయం వైపు వెళ్లకుండా నిర్మాణపు పనులు ప్రారంభించండి.