Jammu–Srinagar Direct Vande Bharat Launch: జమ్మూకాశ్మీర్ కు వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జమ్మూ నుంచి శ్రీనగర్ కు నేరుగా వందే భారత్ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించబోతోంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే మధ్యలో దిగి వేరే రైలు మారాల్సి ఉండేది. కానీ, కొత్త వందేభారత్ లో ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడనుంది.
ఏప్రిల్ 30 నుంచి జమ్మూ తావి నుంచి శ్రీనగర్ వరకు నేరుగా వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే కీలక అడుగు కానుంది. ప్రస్తుతం శ్రీనగర్ వైపు వెళ్లే వందే భారత్ రైళ్లు కత్రా స్టేషన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అందువల్ల ఇతర ప్రాంతాల నుంచి జమ్మూ తావి చేరుకున్న ప్రయాణికులు కత్రా వరకు వేరే మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణికులకు కొంత ఇబ్బందిగా మారుతోంది. కానీ, కొత్త రైలు సేవలు ప్రారంభమైన తర్వాత ప్రయాణికులు నేరుగా జమ్మూ తావి స్టేషన్ నుంచి శ్రీనగర్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ మార్గంలో రెండు జతల వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ కొత్త రైళ్లు ఒక్కోటి 20 కోచ్‌లతో ఉండనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు మాత్రం 8 కోచ్ లతో ఉన్నాయి. అందువల్ల కొత్త రైళ్లు ఎక్కువ మందిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత రెండు రోజుల్లోనే ఈ రైళ్ల సాధారణ కమర్షియల్ సేవలు ప్రారంభిస్తాయని అధికారులు వెల్లడించారు. అంటే ప్రయాణికులు త్వరలోనే నేరుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది.
కొత్త వందేభారత్ రైలుతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. రోడ్డు మార్గంలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, వందే భారత్ రైలు ద్వారా ఈ ప్రయాణాన్ని ఐదు గంటల లోపే పూర్తి చేయవచ్చు. ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్గం ప్రత్యేకంగా సవాలుతో కూడుకున్నది. కొండ ప్రాంతాలు, కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైళ్లలో శీతాకాలానికి అనుగుణంగా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. చాలా తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా రైలు సజావుగా నడిచేలా ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణిస్తారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు నేరుగా వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కావడం ఆ ప్రాంత ప్రజలకు, పర్యాటకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.
Read Also: ఏపీకి గుడ్ న్యూస్, కాకినాడ నుంచి మైసూరు వరకు డైరెక్ట్ రైలు వచ్చేస్తోంది!