Indian Railways passenger rights: పండుగల సమయంలో రైలు టికెట్లు దొరకడం ఎంత కష్టమో తెలిసిందే. ఒక వేళ దొరికినా.. ప్రయాణం అంతా సాఫీగా ఉండదు. మీ లక్ బాగోకపోతే.. మీ బెర్తును రిజర్వేషన్ లేని వ్యక్తులు కబ్జా చేసే ప్రమాదం ఉంది. సరిగ్గా ఇదే పరిస్థితి ఆ దంపతులకు ఎదురైంది. ప్రయాణంలో నరకయాతన అనుభవించారు. అయితే, దాన్ని వారు మౌనంగా భరించి.. మనకెందుకులే అని వదిలేయలేదు. తమ సమస్యను రైల్వేకు విన్నవించారు. అయితే, రైల్వే దీనిపై వితండ వాదం చేసింది. దీంతో వారు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. చివరికి ఏమైందంటే..
డిసెంబర్ 10, 2023న ఘటన చోటు చేసుకుంది. టి.పార్థసారథి, ఆయన భార్య నిర్మలా, వారి కుమారుడు ఆదిత్య కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. పార్థసారధి, నిర్మలా వృద్ధులు కావడంతో వారికి S2 కోచ్‌లో లోయర్ బెర్త్‌లు, ఆదిత్యకు S6లో అప్పర్ బెర్త్ లభించింది. అయితే, రైలు కిక్కిరిసి ఉండటం వల్ల తమ రిజర్వుడు సీట్లలో కూర్చోలేని పరిస్థితి. అప్పటికే అన్ రిజర్వుడ్ ప్రయాణికులు వారి బెర్తులను ఆక్రమించేశారు. ఎంత ప్రయత్నించినా లేవకుండా మొండికేశారు. S6 కోచ్‌లో ఉన్న వాళ్ల అబ్బాయి పరిస్థితి కూడా ఇంతే.
వాళ్లు వృద్ధులు కావడంతో వారి బెర్తుల్లో కూర్చున్నవారిని బతిమాలుకొన్నారు. చివరికి సీట్లు దక్కాయి. కానీ, అక్కడి నుంచి కదల్లేని పరిస్థితి. ప్రయాణికులు కొందరు వాళ్ల కాళ్ల దగ్గర పడుకున్నారు. మరికొందరు టాయిలెట్‌కు వెళ్లే దారి మొత్తాన్ని మూసేశారు. దీంతో వారు వాష్ రూమ్‌కు కూడా వెళల్లేకపోయారు. దీంతో వారు రాత్రి 8.12 గంటలకు RailMadad యాప్ ద్వారా అధికారికంగా తమ పరిస్థితి గురించి ఫిర్యాదు చేశారు. టీటీఈ కోచ్‌ను తనిఖీ చేయలేదని, బోగీ మొత్తం రద్దీగా ఉందంటూ మరో ఫిర్యాదు చేశారు. అయినా స్పందన రాలేదు.
దీనిపై కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజుమర్ కమిషన్ విచారణ చేపట్టింది. అయితే, రైల్వే తమ తప్పేమీ లేదన్నట్లుగా వాదించింది. వారు ఇచ్చిన ఫిర్యాదులపై తమ సిబ్బంది స్పందించారని, వివిధ స్టేషన్లలో టికెట్ లేనివారిని రైలు నుంచి దించేశారని రైల్వే పేర్కొంది. అయితే, ఇందుకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు.. సిబ్బంది వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించలేకపోయింది. మరోవైపు బాధిత కుటుంబం.. రైల్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కోర్టుకు సమర్పించారు. రైలు మదద్ స్క్రీన్ షాట్లు కూడా చూపించారు. ఆధారాలు ఉండటంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఇరువైపు వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రయాణికులకు సురక్షితమైన, ప్రశాంతమైన ప్రయాణాన్ని అందించడంలో రైల్వే విఫలమైందని పేర్కొంది. దీన్ని సేవా లోపంగా పరిగణిస్తూ.. రూ.50 వేలు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.25,000 కలిపి మొత్తం రూ.75 వేలు చెల్లించాలని రైల్వే శాఖకు ఆదేశించింది.
Also Read: చైనా జిరాంగ్ పోర్ట్.. చిన్న ఆనవాలు కూడా లేదాయే – ఆ భవనం అక్కడే ఎందుకు కట్టారు?
మీ దగ్గర కన్ఫార్మ్ టికెట్ ఉందంటే.. మీకు ఆ బెర్త్ మీద పూర్తి హక్కులున్నట్లే. అందులో వేరొకరు ఎవరు కూర్చున్నా వారిని లేపి.. కూర్చోవచ్చు. మొండికేస్తే.. టీటీఈకి ఫిర్యాదు చేయొచ్చు. అయితే, మీ దగ్గర ఆధారాలు ఉండాలి. రైలులో ఎలాంటి సమస్య ఉన్న నోటి మాటతో చెబితే సరిపోదు. తప్పకుండా ఫొటోలు, వీడియోలు లేదా మొబైల్ ద్వారా చేసిన ఫిర్యాదుల స్క్రీన్ షాట్స్, రసీదులు ప్రతీదీ మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీ వైపు వాదనలను బలంగా వినిపించగలరు. వీలైనంత వరకు రైలు మదద్ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయండి. దాని కంప్లయింట్ నెంబర్ లేదా ఆ కాపీని స్క్రీన్ షాట్ తీసుకుని దాచుకోండి. అప్పుడు మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.