Karnataka Exprees: ఢిల్లీ నుండి బెంగళూరుకు వెళుతున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు.. ట్రైన్ నంబర్ 12628 వాడి రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు కారణంగా ఆదివారం నాలుగు గంటల పాటు ఆగిపోయింది. ఈ సంఘటన దాదాపు 1,500 మంది ప్రయాణికులలో ఆందోళనను రేకెత్తించింది. రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడంతో ఈ బెదిరింపు వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు.
వాడి స్టేషన్‌లో రైలును ఆపిన రైల్వే పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో కూడిన బృందం రైలు యొక్క 22 కోచ్‌లను సమగ్రంగా తనిఖీ చేసింది. ప్రయాణికులను రైలు నుండి దించి..తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రక్రియ సుమారు నాలుగు గంటలు సాగింది. కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. తర్వాత.. ఈ బెదిరింపు ఫేక్ అని తేలింది.
రైల్వేకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని వాడి రైల్వే పోలీసులు గుర్తించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీప్‌సింగ్ రాథోడ్ గా గుర్తించారు. పోలీసుల విచారణలో.. రాథోడ్ తాను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. బెదిరింపు వెనుక అసలు ఉద్దేశం స్పష్టంగా తెలియలేదు. రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన ప్రయాణికులలో.. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులలో తీవ్ర భయాందోళనలను కలిగించింది. నాలుగు గంటలు రైలు ఆలస్యం అవ్వడం రైలు షెడ్యూల్‌లో ఆటంకం ఏర్పడింది. అధికారులు ఇటువంటి నకిలీ బెదిరింపులు రైల్వే సేవలను అడ్డుకోవడమే కాకుండా.. ప్రయాణికులలో భయాన్ని సృష్టించి, చట్టపరమైన పరిణామాలను కూడా కలిగిస్తాయని హెచ్చరించారు.
Also Read: లడఖ్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, ఎందుకంత స్పెషల్ అంటే ?
ఇటీవలి కాలంలో.. భారతదేశంలో రైళ్లు, విమానాశ్రయాలు, ఇతర రద్దీ ప్రదేశాలలో నకిలీ బాంబు బెదిరింపుల సంఖ్య పెరిగింది. 2024లో బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ , పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కానీ అవి కూడా నకిలీవిగా తేలాయి. ఈ బెదిరింపులు భద్రతా వ్యవస్థలపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. ప్రజలలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అధికారులు ఇటువంటి చర్యలను నియంత్రించడానికి కఠిన చట్టాలను అమలు చేయాలి. ప్రజలు ఇటువంటి బాధ్యతారహిత చర్యలకు పాల్పడకుండా ఉండాలని.. ఇలాంటి సమయాల్లో ప్రయాణికులు అధికారులతో సహకరించాలని రైల్వే శాఖ సూచించింది.