Golden Chariot Luxury Train: భారతీయ రైల్వే సంస్థ తక్కువ టికెట్ ఛార్జీలతో నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నది. తక్కువ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది సామాన్యులు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఓ వైపు పేద ప్రజలకు తక్కువ ధరలో రైలు ప్రయాణాన్ని అందిస్తున్న ఇండియన్ రైల్వే సంస్థ.. అదే సమయంలో అత్యంత లగ్జరీ ప్రయాణాలను కూడా అందిస్తోంది. అందులో భాగంగానే గోల్డెన్ చారియట్ అనే లగ్జరీ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ‘జ్యువెల్ ఆఫ్ ది సౌత్’ పేరుతో బెంగళూరు నుంచి ఈ రైలు ప్రయాణం మొదలయ్యింది.
గోల్డెన్ చారియట్ కు తగ్గిన ఆదరణ
ఈ లగ్జరీ రైలులో మొత్తం 80 మంది ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉంటుంది. 13 డబుల్ బెడ్ క్యాబిన్లు, 26 ట్విన్ బెడ్ క్యాబిన్లతో పాటు దివ్యాంగుల కోసం ఓ క్యాబిన్ ఉంటుంది. అయితే, తాజాగా ఈ రైలు కేవలం 38 మంది ప్రయాణీకులతో తన యాత్రను మొదలు పెట్టింది. కర్నాటక పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో పాటు కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSTDC) ద్వారా నిర్వహించబడుతుంది. ఇందులో ఒక్కో టికెట్ ధరను రూ.67,961.79 ($800)గా నిర్ణయించింది.
ఐదు నైట్లు, ఆరు రోజుల ప్రయాణం
తాజాగా బెంగళూరు నుంచి ప్రారంభం అయిన ఈ రైలు ప్రయాణం మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు కొనసాగనుంది. బెంగళూరు, మైసూరు, కాంచీపురం, మహాబలిపురం, తంజావూరు, చెట్టినాడ్, కొచ్చికి వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను ఈ పర్యటనలో చూసే అవకాశం ఉంది.
2018లో గోల్డెయిన్ చారియట్ రైలు కాకర్యకలాపాలు నిలిపివేత
తొలుత గోల్డెన్ చారియట్ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నెమ్మదిగా ఆదరణ తగ్గింది. 2018లో గోల్డెన్ చారియట్ రైలు కార్యకలాపాలను నిలిపివేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ రైలు సేవలను నిలిపివేస్తూ IRCTC నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో మళ్లీ ప్రారంభించబడింది. రైల్వేతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని, లాభాలు ఆర్జించాలని భావిస్తున్నట్లు కర్నాటక టూరిజం అధికారులు తెలిపారు.
ఆక్యుపెన్సీ చాలా తక్కువ
2020తో పాటు 2021లో గోల్డెయిన్ చారియట్ కు సంబంధించి 3 ప్రత్యేక కస్టమైజ్డ్ ట్రిప్‌లు నిర్వహించినట్లు IRCTC అధికారులు తెలిపారు. అయితే, ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. “మేము మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం కల్పించాం. వ్యక్తులు, కంపెనీల కోసం ఈ అవకాశం అందించాం. అందులో భాగంగానే ఇప్పటికే KSTDC, IRCTC జాయింట్ గా రెండు ట్రిప్ లు నిర్వహించనున్నాయి. డిసెంబరు 29, ఫిబ్రవరి 13(2025)న రెండు ప్రైవేట్ కంపెనీలు ఈ ట్రిప్పులను బుక్ చేసుకున్నాయి” అని IRCTC అధికారులు తెలిపారు.
Read Also: ఈ ఏడాది ఇన్ని వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయా? వచ్చే ఏడాది ఇండియన్ రైల్వేలో మరింత జోష్!