Indian Railways: దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. ఒకటి అర మినహా అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే నెట్ వర్క్ ను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది. భారత్ లో మొత్తం 7,400 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని ప్రైవేట్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇండియాలో ప్రైవేట్ రైల్వే స్టేషన్లు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును. దేశంలో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ 2017లో అందుబాటులోకి వచ్చింది.
దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్
దేశంలో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ-చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ ను జూన్ 2017లో రైల్వేశాఖ ప్రైవేటీకరించింది. ప్రైవేట్ సంస్థల ద్వారా మూలధనాన్ని ఉపయోగించి దేశ వ్యాప్తంగా చారిత్రక రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ప్రయత్నాల్లో భాగంగా, ఈ ఐకానిక్ స్టేషన్ పునర్నిర్మించింది. ప్రైవేట్ ఇన్ ఫ్రా సంస్థ బన్సాల్ గ్రూప్, ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ రైల్వే స్టేషన్ డెవలప్ చేశాయి.
2021లో రైల్వే స్టేషన్ పేరు మార్పు
నవంబర్ 2021లో హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ నేరు మార్చుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోండ్ రాణి రాణి కమలపతి గౌరవార్థం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాణి కమలపతి రైల్వే స్టేషన్‌గా పేరు మార్చింది. ఈ రైల్వే స్టేషన్ ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ (WCR) పరిధిలో కొనసాగుతోంది. WCRకు సంబంధించి భోపాల్ రైల్వే డివిజన్ ప్రధాన కార్యాలయంగా పని చేస్తుంది.
అద్భుతంగా రూపొందిన రాణి కమలపతి రైల్వే స్టేషన్
తాజాగా పునర్నిర్మాణం జరిగిన తర్వాత రాణి కమలపతి రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది. ఆధునిక విమానాశ్రయాల మాదిరిగానే విశాలమైన కాన్ కోర్స్, వెయిటింగ్ లాంజ్ లు ఉన్నాయి. ఫుడ్ కోర్టులు, రిటైల్ అవుట్ లెట్ లు కూడా ఉన్నాయి. భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కు రెండో స్టేషన్‌గా పనిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తో అమర్చబడి ఉంది. హైటెక్ నిఘా, భద్రతా వ్యవస్థలను కలిగి ఉంది.
Read Also: రైలు ప్రయాణంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా, రైల్వే మంత్రి కీలక ప్రకటన!
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో స్టేషన్ నిర్వహణ
భోపాల్ లోని రాణి కమలపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధితో దేశం రైల్వే మౌలిక సదుపాయాలలో పెద్ద ముందడుగు పడినట్లు అయ్యింది. ఇది దేశంలో తొలి ప్రైవేట్ నిర్వహణ రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ రైల్వే స్టేషన్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్దతిలో నిర్వహించబడుతోంది. ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తర్వాత న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై CSTతో సహా ప్రధాన స్టేషన్లను పునరుద్ధరించడానికి రైల్వే సంస్థ ఇలాంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.
Read Also: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు చూస్తే పరేషాన్ కావాల్సిందే!