Female Railway Passengers Reservation Quota: భారతీయ రైల్వే సంస్థ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రయాణ అనుభవవాన్ని మెరుగు పరిచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 1989 రైల్వే చట్టం ప్రకారం రైళ్లలో మహిళా ప్రయాణీకులకు బెర్త్ లను రిజర్వ్ చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు ఆయన లోక్ సభలో ప్రకటించారు.
అన్ని రైళ్లలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్
సెక్షన్ 58 ప్రకారం సుదూర మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ లో ఆరు బెర్త్ లను, గరీబ్ రథ్, రాజధాని, దురంతో, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ ప్రెస్ రైళ్లలోని 3ACలో వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ప్రయాణీకులకు 6 బెర్త్ లను రిజర్వేషన్ చేయడానికి అవకాశం ఉందన్నారు. స్లీపర్ క్లాస్ లో కోచ్ కు 6 నుంచి 7 లోయర్ బెర్త్ లు, 3ACలో కోచ్ కు 4 నుంచి 5 లోయర్ బెర్త్ లు, 2ACలో కోచ్‌కు 3 నుంచి 4 లోయర్ బెర్తులను మహిళలు రిజర్వేషన్ చేసుకోవచ్చని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణీకులు, గర్భిణీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కమ్ గార్డ్స్ కోచ్ (SLR)లో మహిళలకు సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఇక EMU (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్)/DMU (డీజిల్ మల్టిపుల్ యూనిట్)/MMTS (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్)లో డిమాండ్ ప్రకారం మహిళా ప్రయాణీకులకు ప్రత్యేకమైన అన్‌రిజర్వ్డ్ కోచ్‌లు, కంపార్ట్ మెంట్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
మహిళా ప్రయాణీకుల భద్రతకు కీలక చర్యలు
ముంబై, కోల్ కతా, సికింద్రాబాద్, చెన్నై శివారు ప్రాంతాలతో పాటు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో మహిళలకు ప్రత్యేక EMU, MEMU, MMTS సేవలను నడపడానికి అవసరమైన విభాగాలను ఏర్పాటు చేసినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. “రైళ్లలో మహిళా ప్రయాణీకులకు సరైన వసతులు కల్పించడం, డిమాండ్ ఆధారంగా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించే దిశగా నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే మార్గాలు, విభాగాలలో భద్రత కోసంరైల్వే పోలీసుల(GRP)తో పాటు రైల్వే రక్షణ దళం (RPF) రైళ్లకు ఎస్కార్ట్ ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణీకులు నేరుగా లేదంటే హెల్ప్ లైన్ నంబర్ 139 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Read Also: ఏసీ కోచ్ లోకి అడుగు పెట్టిన ప్రయాణీకుడికి దిమ్మతిరిగే షాక్.. నెట్టింట వీడియో వైరల్!
సోషల్ మీడియా వేదికగా సమస్యల పరిష్కారం
రైల్వే అధికారులు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణీకులకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని వారిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి కోచ్‌లలో, రైల్వే స్టేషన్లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తంగా మహిళా ప్రయాణీకుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు రద్దు, హోలీ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!