Trump Income Tax USA| భారత దేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతికి ఆదాయపు పన్ను చెల్లింపుల్లో భారీ ఊరట కలిగించింది. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ తరహాలోనే అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కూడా ఆదాయపు పన్నుకు సంబంధించిన భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపులు అందించే భారీ పన్ను సంస్కరణ ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 1,50,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారికి ఫెడరల్ పన్నులను తొలగించాలన్న ఆలోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని తాజాగా సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ తెలిపారు.
“ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 1,50,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన లక్ష్యం. దానికోసమే నేను పని చేస్తున్నాను,” అని లుట్నిక్ తెలిపారు. అలాగే అమెరికన్ల పన్ను భారాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను లుట్నిక్ ప్రస్తావించారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.
Also Read: వారు శాశ్వతంగా అమెరికాలో ఉండడానికి వీల్లేదు.. గ్రీన్ కార్డ్ దారులకు షాకింగ్ వార్త
ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. సంవత్సరానికి 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.3 కోట్లు) కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. మెక్సికో, కెనడా దేశాలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. ఈ విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.
ఇక.. పన్ను కోతలతో ముడిపడిన ఆర్థిక లోటు పెరుగుతుండడం గురించి ఆందోళనలపై స్పందిస్తూ.. ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదని లుట్నిక్ తెలిపారు. విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావి.., “ఇతర వ్యక్తులు” ఈ వ్యయాన్ని భరించాలని ఆయన అన్నారు. అంతర్జాతీయ పన్ను లోపాలను సరిదిద్దడం ద్వారా దేశీయ పన్ను భారాన్ని తగ్గించవచ్చని ఆయన వివరించారు. మరోవైపు.. ట్రంప్ ఇటీవల ప్రకటించిన వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల గోల్డ్ కార్డ్ వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల క్రితం కాంగ్రెస్ సభలో ప్రసంగిస్తూ.. ఆర్థిక మాంద్యం నుంచి అమెరికన్లకు శాశ్వత రక్షణ కలిగించడానికి ఒక ప్రతిపాదన చేశారు. ఇందులో భాగంగానే పౌరుల ఓవర్ టైమ్ సంపాదన పైనా, వారు బహుమానంగా పొందే టిప్స్, వృద్ధుల సోషల్ సెక్యూరిటీ ద్వారా వచ్చే ఆదాయంపైనా పన్ను తొలగించేందుకు ఒక చట్టం తీసుకురావాలని ప్రతిపాదించారు. దీని కోసం త్వరలో చట్టసభల్లో తమ ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశ పెట్టబోతోందని.. తమ సెనేటర్లతో పాటు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా దానికి మద్దతు తెలపాలని కోరారు. అలా చేయకపోతే ప్రజలు వారికి మరో సారి ఓటు వేయరని హెచ్చరించారు.