Indian Train Names: గోదావరి, కృష్ణ, నాగావళి, గరీబ్ రథ్, రాజధాని, శతాబ్ది, ముంబై, చెన్నై, విశాఖ, తిరుమల, పూరి, సింహాద్రి ఇవన్నీ నదులు, నగరాలు, పుష్యక్షేత్రాల పేర్లు మాత్రమే కాదు, భారతీయ రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నడిచే రైళ్ల పేర్లు కూడా. అయితే, ఈ రైళ్లకు పేర్లు ఎలా పెడతారు? పేర్లు పెట్టేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? అన్ని రైళ్లకు అధికారికంగా నామకరణం జరుగుతుందా? పేర్లు లేని రైళ్లు ఉంటాయా? ఈ పేర్ల కథ వెనుక ఎలాంటి కసరత్తు జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రైలుకు పేరు ఎలా పెడతారంటే?
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వే రోజూ వేలాది రైళ్లను నడుపుతున్నది. లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. అయితే, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించే ఈ రైళ్లకు పేర్లు ఉంటాయి. ఈ పేర్లను నిర్ణయించడానికి చాలా కసరత్తు జరుగుతుంది. ఒక రైలుకు పేరు పెట్టాలంటే స్థానిక ప్రజల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. అదే సమయంలో ఆ రైళ్లు తిరిగే ప్రాంతాల విశిష్టత, పుణ్యక్షేత్రాలు, నదులు, ఆ రైళ్లను ప్రవేశ పెట్టిన సందర్భం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
⦿ గోదావరి ఎక్స్ ప్రెస్: 1974, ఫ్రిబవరి 1న దీన్ని ప్రవేశపెట్టారు. ఈ రైలు రీసెంట్ గా 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ రైలు ప్రారంభం అయిన తొలి రోజులలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లకు సర్వీసులను అందించేది. ఈ రైలులో ఎక్కువగా గోదావరి ప్రజలే రాకపోకలు కొనసాగించే వారు. ఆ తర్వాత ఈ రైలుకు గోదావరి నది పేరుతో అధికారికంగా గోదావరి ఎక్స్ ప్రెస్ అని నామకరణం చేశారు.
⦿ గరీబ్ రథ్: దీనికి పేదల రథం అని అర్థం. పేదలకు కూడా ఏసీ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2005లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వేశాఖ. పేదల కోసం తీసుకొచ్చిన రైలు కాబట్టి దీనికి గరీబ్ రథ్ అని పేరు పెట్టారు.
⦿ దురంతో ఎక్స్ ప్రెస్: దురంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్లేది అని అర్థం. తక్కువ స్టేషన్లలో ఆగుతూ, ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి ఈ రైలుకు దురంతో ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు.
⦿ శతాబ్ది ఎక్స్ ప్రెస్: భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతి సందర్భంగా 1989లో ఈ రైలును ప్రవేశపెట్టారు. అందుకే దీనికి శతాబ్ది ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు.
⦿ తిరుమల ఎక్స్ ప్రెస్: విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు తిరుగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఎక్కువగా ఈ రైలులో ప్రయాణం చేస్తుంటారు. అందుకే దీనికి తిరుమల ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు.
రైలుకు పేరును ఎలా ఖరారు చేస్తారంటే?
రైలుకు పేరు పెట్టే సమయంలో ఆ రైలు తిరిగే ప్రాంతాల ప్రజల అభిప్రాయలకు రైల్వేశాఖ తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ముందుగా అక్కడి ప్రజల సలహాలు, సూచనలను తీసుకుంటుంది. రైలుకు ఈ పేరు బాగుంటుంది అని అనిపిస్తే, ఆ పేరును రాసి స్థానిక రైల్వే స్టేషన్ లోని సూచనల బాక్సులో వేయాలి. లేదంటే రైల్వే అధికారులకు లెటర్స్ రూపంలో ఇవ్వచ్చు. స్థానిక ఎంపీ దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చు. వాటన్నింటీని పరిగణలోకి తీసుకుని రైల్వేశాఖ పేరును ఖరారు చేస్తుంది. ఆ పేరును పత్రికలు, టీవీల ద్వారా ప్రజలకు తెలిసేలా చేస్తుంది.
Read Also: ఓడియమ్మ.. ఈ ఒక్క రైలు సంపాదనే అన్నికోట్లా? ఇది ఏ రూట్‌లో వెళ్తుందంటే…?