Tirumala Unknown Facts: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో మహిమలు కలిగిన బాలాజీని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తకోటితో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతాయి. రోజూ 70 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ వేంకటేశ్వరుడికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ రహస్య గ్రామం
శ్రీవారి ఆలయంలో ఆరాధన కోసం ఉపయోగించే పూలు, పండ్లు, పాలు, పెరుగు, వెన్న, మూలికల ఔషధాలు సహా అవసరమైన అన్ని వస్తువులు తిరుపతికి 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి తీసుకొస్తారట. స్థానిక ప్రజలకు తప్ప, ఆ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు అసవరమయ్యే అంత సామాగ్రిని అక్కడి నుంచే తీసుకొస్తారు.
⦿ శ్రీవారి విగ్రహం
తిరుమల శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి గర్భగుడికి కుడి వైపు మూలలో ఉంటుంది. సరిగ్గా గమనిస్తేనే ఈ విషయం తెలుస్తుంది.
⦿ శ్రీవారి జుట్టు
వేంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి నిజమైన జుట్టు ఉంటుంది. వెంకేటశ్వరుడు భూమ్మీద ఉన్న సమయంలో శ్రీవారికి ఊహించని ప్రమాదం జరుగుతుంది. తన జుట్టులో కొంత భాగం కోల్పోతాడు. వెంటనే నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి భక్తితో సమర్పిస్తుంది. అప్పటి నుంచి తన దర్శనానికి వచ్చేవాళ్లు ఎవరు తలనీలాలు సమర్పిస్తారో వారికి తన ఆశీస్సులు ఉంటాయని చెప్తారు. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు తలనీలాలు ఇస్తారు.
⦿ విగ్రహం వెనుక సముద్ర ఘోష
శ్రీవారి విగ్రహం ఎప్పుడూ సముద్రం ఘోష వినిపిస్తుందట. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా తెలుస్తుందట. శ్రీవారి అర్చకులకు మినహా మరెవరికీ విషయం తెలియదు.
⦿ కొండెక్కని దీపాలు
గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల నిర్మలమైన హృదయాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ఈ దీపాలను ఎప్పుడు? ఎవరు వెలిగించారనే విషయం ఇప్పటికీ తెలియదు.
⦿ వేంకటేశ్వరుడి నిజ దర్శనం
19వ శతాబ్దంలో దారుణ నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఉరి తీయాలంటాడు. మరణం తర్వాత వారి మృతదేహాలను తిరుమల గోడలకు వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలోని శ్రీవారు నిజ రూపంలో దర్శనం ఇచ్చినట్లు చెప్తారు.
⦿ విగ్రహ రహస్యం
శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తడిగా ఉంటుంది. పూజారులు ఆ విగ్రహాన్ని పొడిగా చేద్దామని భావించినా, విగ్రహం తడిగా మారడం విస్మయాన్ని కలిగిస్తోంది.
⦿ గర్భగుడి పూలు వేర్పేడులో ప్రత్యక్షం
తిరుమల శ్రీవారిని రోజూ అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కి.మీ దూరంలో ఉన్న వేర్పుడులో కనిపిస్తాయి.
⦿ చెక్కు చెదరని విగ్రహం
పచ్చకర్పూరం ఏదైన రాయికి పూస్తే కొద్ది రోజుల్లోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నం అవుతుంది. కానీ, శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. శ్రీవారి విగ్రహం భూమ్మీద ఎక్కడా లేని అరుదైన రాతితో తయారైనట్లు భావిస్తారు.
⦿ శ్రీవారికి చెమటలు
తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలిచినా, సజీవకళతో ఉంటుంది. స్వామివారి విగ్రహం 110 డిగ్రీల ఫారన్ హిట్ వేడితో ఉంటుంది. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల తిరుమల పరిసరాలు చల్లగా ఉంటాయి. స్వామివారి విగ్రహం మాత్రం చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తూడ్చుతారు.
Read Also: సడెన్‌గా సూర్యుడు మాయం అయితే? భూమి ఏమవుతుందో తెలుసా?