Trump Citizenship Order Block| అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అత్యంత ఆర్భాటంగా జారీ చేసిన ‘జన్మతః పౌరసత్వం రద్దు’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమెరికా ఫెడరల్ కోర్టులో అవరోధానికి లోనైంది. ఆ ఉత్తర్వులను అమల్లోకి రాకుండా ఆపాలని కోరుతూ నాలుగు రాష్ట్రాలు వేసిన పిటిషన్‌ను విచారణ చేసిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి. కాఫ్నర్ ఆ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేశారు.
జడ్జి కాఫ్నర్ ఉత్తర్వులపై వ్యాఖ్యానిస్తూ.. “ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగానికి విరుద్ధం. అవి అమల్లోకి రాకుండా తాత్కాలికంగా నిలిపివేస్తున్నాను,” అని పేర్కొన్నారు. డెమొక్రాట్స్ అధికారంలో ఉన్న వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయిస్, ఒరేగన్ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌ను గురువారం విచారణ చేసి ఆయన ఈ తీర్పును ఇచ్చారు. అయితే ఈ పిటిషన్ విచారణ ఇకపై కీలకంగా మారనుంది. మరోవైపు, ట్రంప్ ఈ తీర్పుపై స్పందిస్తూ, “తాము కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని” స్పష్టం చేశారు.
పౌరసత్వ రద్దు ఆదేశాలపై విమర్శలు
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే వలసదారుల పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధమని డెమోక్రటిక్ పార్టీ నేతలు, భారతీయ అమెరికన్ చట్టసభ్యులు తీవ్రంగా విమర్శించారు. ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నేత రో ఖన్నా, “ఇది చట్టబద్ధంగా వలస వచ్చిన వారి పిల్లల పౌరసత్వ హక్కును సైతం లంకించుకుంటుంది. జన్మతః పౌరసత్వం రాజ్యాంగంలో హామీ ఇచ్చిన హక్కు. దీని కోసం గట్టిగా పోరాడతాం,” అని తెలిపారు.
ప్రతినిధుల సభలో మరో భారతీయ మూలాలున్న నేత ప్రమీలా జయపాల్ ఆగ్రహంగా, “ట్రంప్ ఉత్తర్వు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. ఇది అమల్లోకి వస్తే దేశ చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్టే,” అని పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ క్షమాభిక్ష పెట్టినా.. కేసు రికార్డులు దాచే ఉంటాయన్న న్యాయమూర్తులు.. వారి అర్థమేంటి..
న్యాయపోరాటం కొనసాగుతోంది
ట్రంప్ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం లభించాలనే రాజ్యాంగ నిబంధనలను న్యాయవాదులు వాదించారు. సియాటెల్ కోర్టులో జడ్జి జాన్ కాఫ్నర్ ఆ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేయడం ట్రంప్ పాలనకు తొలి పోటీగా నిలిచింది.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, “మా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కాపాడేందుకు దశలవారీగా న్యాయ పోరాటం చేస్తాం,” అని ప్రకటించారు.
అమెరికాలో సిజేరియన్ ఆపరేషన్ కోసం బారులు తీరుతున్న భారతీయ గర్భిణులు
ఆమె నిండు గర్భిణీ. ఎన్నో కలలతో సప్త సముద్రాలు దాటి అమెరికా చేరి, పర్మినెంట్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, తమ బిడ్డ అమెరికాలో పుట్టి పౌరసత్వం పొందుతాడని ఆశపడింది. కానీ, ట్రంప్ తీసుకున్న పౌరసత్వ మార్పులు ఆశలన్నింటికీ దెబ్బతీశాయి.
వందేళ్లుగా అమలులో ఉన్న పుట్టుకతో పౌరసత్వం విధానాన్ని ట్రంప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వరని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, విదేశీయులలో, ముఖ్యంగా గర్భిణీ తల్లుల్లో ఆందోళనలు పెరిగాయి. ఫిబ్రవరి 20కు ముందే పిల్లలను కనడానికి దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, సిజేరియన్ కోసం ఒత్తిడి తెస్తున్నారు.
వైద్యులు ముందస్తు సిజేరియన్ వల్ల పిల్లల ఆరోగ్యంపై వచ్చే నష్టాలను హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులు, శారీరక భాగాలు సరిగా ఎదగకపోవడం, తక్కువ బరువు వంటి సమస్యలు కలగొచ్చని చెబుతున్నారు. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం పౌరసత్వానికంటే ముఖ్యమని తల్లిదండ్రులను జాగృతం చేస్తున్నారు.