Japan Floating Airport: ప్రపంచ విమానయాన రంగం రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. తక్కువ భూభాగం ఉన్న దేశాలు, ఏకంగా సముద్ర జలాలపైనే విమానాశ్రయాలను నిర్మిస్తున్నాయి. ప్రపంచంలో తొలిసారి తేలియాడే ఎయిర్ పోర్టు నిర్మించింది జపాన్. ఇంతకీ ఈ ఎయిర్ పోర్టును ఎలా నిర్మించింది? ఎప్పుడు నిర్మించింది? దీని ప్రత్యేకతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1994లో తేలియాడే ఎయిర్ పోర్టు నిర్మాణం
తేలియాడే ఎయిర్ పోర్టును జపాన్ ప్రభుత్వం 1994లో నిర్మించింది. ఈ ఎయిర్ పోర్టుకు కన్సాయ్ అనే పేరు పెట్టింది. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అప్పట్లోనే ఏకంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకునేలా దీనిని నిర్మించినట్లు అప్పట్లో జపాన్ ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టు ముప్పు అంచున నిలబడి ఉంది. రోజు రోజుకు ఈ ఎయిర్ పోర్టు సముద్రంలో కుంగిపోతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొద్ది సంవత్సరాల్లో పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
జపాన్ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం
జపాన్ ప్రభుత్వం నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతం కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. జపాన్ సముద్ర తీరానికి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో సముద్రంపై దీనిని నిర్మించారు. ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలోనే తొలి తేలియాడే ఎయిర్ పోర్టును నిర్మించారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం జపాన్ సముద్రంలో కృత్రిమంగా ఐలాండ్ ను తయారు చేసింది. 1987లో ఈ ఎయిర్ పోర్టు పనులు మొదలుకాగా, 1994లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానాశ్రయం ద్వారా ప్రతి ఏటా 25 మిలియన్ల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి పలు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.
Read Also: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?
2025 నాటికి తేలియాడే విమానాశ్రయం కనుమరుగు
అద్భుతమైన ఈ తేలియాడే విమానాశ్రయం ప్రస్తుతం ప్రమాదపు అంచులో నిలబడింది. రోజు రోజుకు ఈ విమానాశ్రయం కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. 2020 వరకు ఈ విమానాశ్రయం 20 అడుగుల మేర మునిగిపోయినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మించే సమయంలోనే కొంత మేర ముంపు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, వారు అనుకున్న అంచనా కంటే 25 శాతం ఎక్కువగా మునిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విమానాశ్రయం నెమ్మదిగా నీటమునగడం ఖాయం అంటున్నారు ఇంజినీరింగ్ నిపుణులు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో నింపిన మట్టి నెమ్మదిగా సముద్రంలో కలిసిపోవడం వల్లే విమానాశ్రయం కుంగినట్లు గుర్తించారు. 2050 నాటికి ఈ విమానాశ్రయం పూర్తిగా నీటమునిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ విమానాశ్రయాన్ని ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు అధికారులు తగి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఎంత వరకు సక్సెస్ అవుతాయనే విషయంపై క్లారిటీ లేదు.
Read Also: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు, సమ్మర్ లో ప్లాన్ చేసేయండి!