Indiramma Housing Scheme: పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైనవారికి ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే చాలామంది లబ్ధిదారులు ఆర్థిక సమస్యల వల్ల నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ఇళ్ల నిర్మాణాలు సాఫీగా సాగేలా దృష్టి సారించారు.
వారికి మరో బంపరాఫర్
నిర్మాణం మొదలు పెట్టడానికి నిధులు లేక చాలామంది లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఆర్థిక భారం లేకుండా చేసేందుకు వివిధ జిల్లాల అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను రెడీ చేసింది. గ్రామ సమాఖ్యలు, స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. లక్ష వరకు బ్రిడ్జి లోన్ ఇప్పించేందుకు ప్రణాళికలు చేస్తోంది.
ఈ లోన్ ఎలా తీసుకోవాలి? ఉపయోగాలు ఏమిటి? అనేదానిపై ఇందిరా క్రాంతి పథకం యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. తొలి విడతలో భాగంగా కామారెడ్డి జిల్లాలో 22 గ్రామాలకు 1,719 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే 400 ఇళ్లకు మార్కింగ్ పూర్తి చేశారు అధికారులు. కొన్ని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు సర్వే పూర్తి అయ్యింది.
లబ్ధిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులపై ఉంచనున్నారు. నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం రూ. 5 లక్షలు అందజేయనుందని, లబ్ధిదారులు ముందుకొస్తే వారికి లోన్ ఇప్పిస్తామని అంటున్నారు జిల్లా అధికారులు.
ALSO READ: హైకమాండ్ పిలుపు, సీఎం రేవంత్ సహా కీలక నేతలు పయనం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తెలిపిన వెంటనే లబ్ధిదారులు నిర్మాణం పనులు మొదలు పెట్టవచ్చు. ఆయా నిర్మాణాలకు దశల వారీగా రూ. 5 లక్షలను ఆర్థిక సహాయం లబ్ధిదారులకు అందజేస్తుంది ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు ప్రారంభించలేని వారికి లోన్ ఇప్పించి చేయూత అందించాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు.
ముందుగా లోన్, అదెలా సాధ్యం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కింద.. బేస్‌మెంట్ వరకు పూర్తయితే తొలి విడతగా రూ. లక్ష విడుదల చేస్తుంది ప్రభుత్వం. రూఫ్ లెవెల్, స్లాబ్, ఇతరత్రా పనులు పూర్తయిన తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. బేస్‌మెంట్ నిర్మాణం మొదలు వివిధ దశల్లో పనులు నిలిచి పోకుండా ఉండేందుకు ఈ లోన్ సహాయపడనుంది. ముఖ్యంగా పునాదులు తవ్వడం, ఇసుక, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి కొనుగోలు డబ్బును లబ్ధిదారులు వినియోగించుకోవచ్చు.
నిర్మాణం పూర్తయి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుతో తీసుకున్న లోన్ ను లబ్దిదారులు తిరిగి చెల్లించవచ్చు. దీనివల్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. కామారెడ్డి జిల్లాలో 60 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయి నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులు ముందుకొస్తే రూ. లక్ష వరకు లోన్ ఇప్పిస్తామని అంటున్నారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించామని చెబుతున్నారు జిల్లా అధికారులు. ఇందిరమ్మ ఇళ్లు 600 చదరపు అడుగుల లోపు నిర్మించుకోవాలి. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.